
ఖాతాదారులకు సేవలు మరింత చేరువ చేస్తాం
కర్నూలు(అగ్రికల్చర్): భారతీయ స్టేట్ బ్యాంకు సేవలను మరింత సులభతరం చేస్తున్నట్లు అమరావతి సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్‌కుమార్ పటేల్ తెలిపారు. సోమవారం గాయత్రీ ఎస్టేట్ సమీపంలోని ఎస్‌బీఐకి చెందిన దాదాపు 4.50 ఎకరాల భూమిలో వివిధ విభాగాలు ఒకే సముదాయంలో ఉండేలా రూ.13 కోట్లతో నిర్మించే భారీ భవన నిర్మాణానికి ఆయన తన సతీమణి సప్నా పటేల్‌తో కలసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఎస్‌బీఐ మౌలిక వసతుల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలు రాయి వంటిదన్నారు. ఈ భవన సముదాయంలో పరిపాలన విభాగం, రీజినల్ బిజినెస్ సెంటర్, ప్రాసెసింగ్ సెంటర్, ఆర్‌ఏఎస్‌ఎంఈసీసీ, ఏఎంసీసీ, ఎస్‌ఎంఈ బ్రాంచీలతో పాటు ప్రస్తుతం గాయత్రీ ఎస్టేట్‌లో ఉన్న టిఫ్ బ్రాంచ్ కూడా ఉంటాయన్నారు. ఈ భవన నిర్మాణ పనులు 15 నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అమరావతి సర్కిల్ (ఎన్‌డబ్ల్యూ–3) జనరల్ మేనేజర్ అమ్రేంద్రకుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్‌లు పంకజ్‌కుమార్, హేమా, రీజినల్ మేనేజర్లు, కర్నూలులోని వివిధ బ్రాంచీల అధికారులు పాల్గొన్నారు.