
తుంగభద్రకు భారీ వరద
కర్నూలు (సిటీ): తుంగభద్ర నదికి భారీగా వరద నీరు వస్తోంది. కర్ణాటక రాష్ట్రం హొస్పేట్ వద్ద ఉన్న టీబీ డ్యాం నుంచి ఆదివారం ఉదయం 90,893 కూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. సాయంత్రానికి ఇన్‌ఫ్లో పెరగడంతో 1.20 లక్షల క్యూసెక్కులకు నీటి విడుదలను పెంచారు. అర్ధరాత్రి తరువాత డ్యాంలోకి ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉండడంతో 1.40 లక్షల క్యూసెక్కులకు పెంచనున్నట్లు టీబీ డ్యాం ఎస్‌ఈ నారాయణ నాయక్ తెలిపారు. నదికి భారీగా నీటిని విడుదల చేస్తుండడంతో జల వనరుల శాఖతో పాటు, ఏపీ విపత్తుల విభాగం అధికారులను సైతం తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. నదిలోకి ప్రయాణాలు నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. తుంగభద్ర నదితో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్యలో ఉన్న వేదావతి నదిలో సైతం కొంత వరద నీరు ప్రవహిస్తోంది.
సుంకేసుల నుంచి
91 టీఎంసీల నీరు దిగువకు..
తుంగభద్ర నది ప్రవాహం పెరడంతో కేసీ ఇంజినీర్లు అప్రమత్తం అయ్యారు. ఎగువ నుంచి వస్తున్న నీటిని ఎప్పటికప్పుడు డీఈఓ ఎన్.ప్రసాద్ రావు సుంకేసుల బ్యారేజీ దగ్గర ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. బ్యారేజీకి రెగ్యులర్ ఏఈఈ లేకపోవడంతో ఇంచార్జీ ఏఈఈ మహేంద్రరెడ్డితో డీఈఈ సమీక్షిస్తూ గేట్ల పనితీరును పరిశీలించారు. ఎగువ నుంచి వచ్చే నీటిని రెగ్యులర్‌గా మానిటరింగ్ చేసుకోని వచ్చే నీటినంతా దిగువకు విడుదల చేసేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఏఈఈకి సూచించారు. సుంకేసుల బ్యారేజీకి సాయంత్రం 6 గంటలకు 50 వేల క్యుసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, 52,682 క్యూసెక్కుల నీటిని దిగువకు, కేసీ కెనాల్‌కు 1,847 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. రాత్రికి సుంకేసుల బ్యారేజీకి వరద నీటి ప్రవాహం పెరగనుండడంతో ఇంజినీర్లు అప్రమత్తమయ్యారు.
టీబీ డ్యామ్ నుంచి 1.20 లక్షల
క్యూసెక్కుల నీరు విడుదల
నేడు 1.40 లక్షల క్యూసెక్కులకు
పెరిగే అవకాశం