
ఉద్యోగం రాక.. పొలం పనులు చేయలేక..
ఎమ్మిగనూరురూరల్: ఆ యువకుడు ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం ఏమీ రాలేదు. ఊరిలో వ్యవసాయ పనులు చేయలేక మనస్తాపం చెందాడు. బనవాసి వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ వెనక భాగంలో వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం గుడేకల్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. వీరారెడ్డి, సుశీల కుమారుడైన బోయ ప్రవీణ్(24) ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదు. తల్లిదండ్రులు ఆదే గ్రామానికి చెందిన తులసితో కుమారుడికి వివాహం జరిపించారు. వీరికి రక్షిత చిన్నారి ఉంది. పొలం పని చేయలేక కొన్ని నెలలుగా ప్రవీణ్ ఇంటి వద్దే ఉండటంతో కొన్ని దురలవాట్లు వచ్చాయి. శనివారం సాయంత్రం తండ్రి వద్ద రూ. 600 డబ్బులు తీసుకొని బయటకు వెళ్లి రాత్రి ఇంటికి రాలేదు. స్నేహితులతో కలసి ఎక్కడికైనా వెళ్లి ఉంటాడనని తల్లిదండ్రులు అనుకున్నారు. ఆదివారం ఉదయం తండ్రి వీరారెడ్డి కుమారుడి విషయంపై స్నేహితుల వద్ద ఆరా తీయగా వారు తాము చూడలేదని చెప్పటంతో ఆందోళన చెందారు. బనవాసి ఫారెస్ట్‌లో బోయ ప్రవీణ్ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న దృశ్యాన్ని చూసి గొర్రెలు మేపే వారు ఫోన్లో ఫొటో తీశారు. ఈ విషయం రూరల్ పోలీసులకు తెలవడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని దించి పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కుమారుడి మృతదేహం చూసి తల్లి, భార్య, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెద్ద సంఖ్యలో బంధువులు, స్నేహితులు ప్రభుత్వాసుపత్రికి చేరు కున్నారు తండ్రి వీరారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య