పీఎంఏజీవై గ్రామాల అభివృద్ధికి చర్యలు చేపట్టండి | - | Sakshi
Sakshi News home page

పీఎంఏజీవై గ్రామాల అభివృద్ధికి చర్యలు చేపట్టండి

Jul 25 2025 4:30 AM | Updated on Jul 25 2025 4:30 AM

పీఎంఏజీవై గ్రామాల అభివృద్ధికి చర్యలు చేపట్టండి

పీఎంఏజీవై గ్రామాల అభివృద్ధికి చర్యలు చేపట్టండి

కర్నూలు(సెంట్రల్‌): పీఎంఏజీవై(ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన) పథకం కింద ఎంపికై న గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో పీఎంఏజీవై అభివృద్ధి పనులపై కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫేజ్‌–2 కింద ఎంపిక చేసిన గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ప్రతిపాదించాలన్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీల మరమ్మతులు, తాగునీటికి సంబంధిచి ఫిల్డర్‌ బెడ్‌లు, పీఆర్‌కు సంబంధించి రోడ్లు, మౌలిక వసతులు తదితరాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమావేశంలో జేడ్పీ సీఈఓ నాసరరెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రాధిక, ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఈ.బాలచంద్రారెడ్డి, ఐసీడీఎస్‌ పీడీ నిర్మల, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ నాగేశ్వరరావు, విద్యుత్‌ ఎస్‌ఈ ఉమాపతి, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ భాస్కరరాజు పాల్గొన్నారు.

ఉరుకుందలో ‘నవో’దయం

● ప్రారంభమైన 9 వారాలు, 9 ప్రదక్షిణలు

కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద ఈరన్నస్వామి దేవాలయంలో శుక్రవారం నుంచి శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో దేవాలయంలో గురువారం ప్రత్యేకంగా 9 వారాలు, 9 ప్రదక్షిణల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆలయ డిప్యూటీ కమిషనర్‌ విజయరాజు ఆధ్వర్యంలో లక్షపుష్పార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. గురువారం అమావాస్య, ఆషాఢ మాసం చివరి రోజు కావడంతో మహాలక్ష్మి అమ్మవారికి భక్తులు శాస్త్రోకంగా సారెను సమర్పించారు. పిండివంటలతో స్వామికి నైవేద్యం సమర్పించారు. భక్తుల సౌకార్యర్థం ఆదోని, ఎమ్మిగనూరు, కర్ణాటకలోని రాయచూరు, శిరుగుప్ప ఆర్టీసీ డిపోలవారు ప్రత్యేక బస్సులను నడిపారు.

జిల్లాలో 1,930 మెట్రిక్‌ టన్నుల యూరియా

కర్నూలు(సెంట్రల్‌): జిల్లాలో 1,930 మెట్రిక్‌ టన్నుల యూరియా లభ్యతలో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్కుఫెడ్‌ వద్ద 491.4 మెట్రిక్‌ టన్నులు, రైతు సేవా కేంద్రాల వద్ద 399.67 మెట్రిక్‌ టన్నులు, రిటైలర్స్‌ దగ్గర 984 మెట్రిక్‌ టన్నులు, సహకార సంఘాలు, మార్కెటింగ్‌ సొసైటీల దగ్గర 54.535 మెట్రిక్‌ టన్నుల యూరియా ఉందన్నారు. జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ వర్షపాతం 401.1 మి.మీ కాగా ఇప్పటి వరకు 141.3 మి.మీ., వర్షపాతం నమోదైందన్నారు. ఖరీఫ్‌–2025లో సాధారణ పంట విస్తీర్ణం 4,22,510 హెక్టార్లు కాగా.. పత్తి, వేరుశనగ, కంది, మొక్కజొన్న, వరి, మినుము, ఉల్లి, మిరప తదితర ప్రధాన పంటలు సాగు చేస్తారన్నారు. అయితే ఇప్పటి వరకు 2,19,875 హెక్టార్ల విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగయ్యాయని, ఇందులో ప్రధానంగా పత్తి 1,63,792 హెక్టార్లలో సాగైనట్లు పేర్కొన్నారు.

జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు చిప్పగిరి, ఆలూరు, హొళగుంద, హాలహర్వి మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైంది. జిల్లా మొత్తంగా సగటున 8 మి.మీ వర్షం కురిసింది. జూలై నెల సాధారణ వర్షపాతం 90.7 మి.మీ ఉండగా.. ఇప్పటి వరకు 75 మి.మీ వర్షపాతం నమోదైంది. రానున్న రెండు రోజుల్లో వివిధ మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement