
మంత్రి ఇలాకాలో రెండోసారి విజయం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి
మంత్రి టీజీ భరత్ ఉన్న కర్నూలులో రెండోసారి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నిక అవుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి విరమించుకుందన్నారు. గురువారం సాయంత్రం కర్నూలులోని వైఎస్సార్ సర్కిల్ వద్ద మహానేత విగ్రహానికి పూల మాలలు వేశారు. ఘనంగా నివాళ్లు అర్పించారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయం దాదాపు ఖరారు కావడంతో పెద్ద ఎత్తున్న బాణా సంచా కాల్చారు. స్వీట్లు పంపిణీ చేశారు. స్టాండింగ్ కమిటీకి పోటీ చేసిన మునెమ్మ, షేక్ అహమ్మద్, నారాయణ రెడ్డి, వెంకటేశ్వర్లు, సాంబ శివరావులను పార్టీ జిల్లా అధ్యక్షులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. మేయర్ బీవై రామయ్య, డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, మాజీ జిల్లా అధ్యక్షురాలు సిట్రా సత్యనారాయణమ్మతో కలిసి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడారు. మంత్రి నియోజకవర్గంలో రెండోసారి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ స్టాండింగ్ కమిటీ సభ్యులు సునాయసంగా గెలిచారన్నారు. గత ఏడాది అధికార పార్టీ ఎన్నో కుయుక్తులు, డబ్బు ఎర వేసిన వైస్సార్‌సీపీ అభ్యర్థులే గెలిచారని గుర్తు చేశారు. పార్టీ మరింత బలిష్టంగా ఉందని రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు నిర్వహించినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయం ఖాయమన్నారు. తమ విజయానికి పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి కృషి చేశారని, వారికి కార్ప్పొరేటర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులు కతృజ్ఞతలు తెలిపారు.