
డ్రిప్ పరికరాలు సత్వరం సరఫరా చేయాలి
కర్నూలు(అగ్రికల్చర్): రైతులకు సకాలంలో సూక్ష్మసేద్యం పరికరాలు సరఫరా చేయడంతో పాటు వాటిని వెంటనే అమర్చాలని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ కె.శ్రీనివాసులు డ్రిప్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. మంగళవారం కర్నూలులోని ఉద్యానభవన్‌లో డ్రిప్ కంపెనీల జిల్లా కో–ఆర్డినేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025–26లో 7వేల హెక్టార్లకు డ్రిప్ సదుపాయం కల్పించాలనేది లక్ష్యమని, ఇప్పటి వరకు 591 హెక్టార్లకు డ్రిప్ మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు ఇచ్చామన్నారు. కర్నూలు, కోడుమూరు, పాణ్యం నియోజక వర్గాలకు ఫిబ్రవరిలోపు 2500 హెక్టార్లకు డ్రిప్ పరికరాలు అమర్చాలని ఆదేశించారు. రైతులకు నాణ్యమైన పరికరాలు, మెటీరియల్ సరఫరా చేయాలని సూచించారు. ఈ ఏడాది ఐదు ఎకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీతో డ్రిప్ మంజూరు చేస్తామన్నారు. ఏపీఎంఐపీ అదనపు పీడీ పిరోజ్‌ఖాన్ మాట్లాడుతూ అన్ని కంపెనీలు నాణ్యమైన పరికరాలు ఇచ్చి సహకరించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఉద్యాన అధికారులు మదన్‌మోహన్‌గౌడు, నరేష్‌కుమార్‌రెడ్డి, ఎంఐ ఇంజనీర్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.