
కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి సారిద్దాం
● నగరంలో ఏడాది కాలంగా అభివృద్ధి పనుల్లేవు ● కల్లూరు, పాతబస్తీలో సమస్యల దరువు ● వైఎస్సార్‌సీపీ కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎస్వీ, కాటసాని
కర్నూలు (టౌన్): మరో ఎనిమిది నెలల వ్యవధిలో వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి సారించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి కార్పొరేటర్లకు పిలుపు నిచ్చారు. మంగళవారం సాయంత్రం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో నగర మేయర్ బీవై రామయ్యతో కలిసి నగరపాలక సంస్థకు చెందిన కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈనెల 24వ తేదీన ముగియనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై చర్చించారు. నాలుగు సంవత్సరాలుగా ఐదుగురు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లే స్టాండింగ్ కమిటీ సభ్యులుగా కొనసాగారని, ఇప్పుడు కూడా అదే సంప్రదాయం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్వీ, కాటసాని మాట్లాడుతూ.. నగర నూతన పాలక మండలి 2021లో కొలువు తీరిందన్నారు. నాలుగు సంవత్సరాలుగా నగరంలోని కర్నూలు అర్బన్, కల్లూరు అర్బన్, కోడుమూరు అర్బన్ ప్రాంతాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామ న్నారు. మౌలిక సదుపాయాలతో పాటు నగరాన్ని ఆకర్షించే విధంగా థీమ్ పార్కులు, రహదారులు, డ్రైనేజీలు, డివైడర్లు, ఇండోర్ స్టేడియాలు, క్రికెట్ స్టేడియం, టెన్నిస్ కోర్టు ఇలా.. ఎన్నో చేపట్టామన్నారు. రూ.28 కోట్లతో నగరపాలక సంస్థ నూతన భవనం నిర్మాణాన్ని 80 శాతం మేర పూర్తి చేశామని, రూ.2.50 కోట్లు వెచ్చించి టర్ఫ్ స్టేడియాలు నిర్వహిస్తే నిర్వహణ లేక పిచ్చిమొక్కలు పెరిగాయన్నారు. ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా... ఈ పరిస్థితులు కర్నూలు కార్పొరేషన్‌లో కనిపించడం దారుణమన్నారు.
ఏడాది దాటినా ... అభివృద్ధి పనులేవీ.?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కర్నూలు నగర పాలక పరిధిలో కనీసం టెండర్లు నిర్వహించలేని పరిస్థితి ఉందని ఎస్వీ, కాటసాని విమర్శించారు. పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొందన్నారు. నేతల ఒత్తిడి తట్టుకొలేక కమిషనర్ బదిలీ వెళ్లిపోయారన్నారు. కల్లూరులో వర్షాకాలంలోనూ మంచినీటి సమస్య నెలకొందన్నారు. పాతబస్తీలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉందన్నా రు. కాలనీలు కంపు కొడుతూ ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. వచ్చే 8 నెలల్లో కార్పొరేషన్‌లో ఎన్నికల హడావుడి ప్రారంభమవుతుందన్నారు. కూటమి వైఫల్యాలపై ప్రజలకు వివరిద్దామని పిలుపు నిచ్చారు. పార్టీ క్యాడర్ పూర్తి స్థాయిలో విశ్వాసంలో ఉందని, కలిసికట్టుగా ప్రజల పక్షాన నిలిచి ప్రజా పోరాటాలు చేద్దామన్నారు. సమావేశంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుకా, స్టాండింగ్ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి సారిద్దాం