
అప్పుల బాధ తాళలేక యువరైతు ఆత్మహత్య
కోడుమూరు రూరల్: అప్పుల బాధ తాళలేక గూడూరు మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన యువరైతు బోయ ప్రసాద్ (27) ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బోయ ప్రసాద్ తనకున్న ఎకరా పొలంతో పాటు మరో నాలుగెకరాలను కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తూ జీవనం సాగించేవాడు. వ్యవసాయం కలిసి రాకపోవడం, కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు రూ.8లక్షల వరకు చేరుకున్నాయి. అప్పులు తీర్చే మార్గం కానరాకపోవడం, అప్పులిచ్చిన వాళ్ల ఒత్తిళ్లు అధికం కావడంతో పది రోజుల కిందట పురుగుల మందు తాగాడు. బోయ ప్రసాద్‌ను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు. గూడూరు పోలీసులకు రైతు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. బోయ ప్రసాద్‌కు భార్య జ్యోతితో పాటు ఏడేళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కు మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.