పెడన: రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్లు సాధించుకోవడానికి తమ ఆధ్వర్యంలో ఈ నెల 22న రాష్ట్రస్థాయిలో కలె క్టరేట్ల ముట్టడి కార్యక్రమం జరుగుతుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పెడన పట్టణంలోని సర్వోదయ సొసైటీలో బుధవారం జరిగిన కృష్ణా జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ అమలుపై చర్చించారు. కలెక్టరేట్ ముట్టడి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. చేనేత రంగాన్ని ఆదుకుంటామన్న ప్రభుత్వ ప్రకటనలు అమలుకావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక పక్క పెరుగుతున్న ముడిసరుకు ధరలు, మరో పక్క గిట్టుబాటు కాని మజూరీ, మార్కెటింగ్ సదుపాయాలు లేకపోవడం వల్ల నేతన్నలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి చేనేత కార్మి కుడికీ అందాలనీ, మగ్గంపై పని చేసే వారికి ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 22న మచిలీపట్నంలోని లక్ష్మీటాకీస్ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లడానికి కార్మికులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కో కన్వీనర్ బండారు ఆనంద ప్రసాద్, పిల్లలమర్రి బాలకృష్ణ, రామనాథం, పూర్ణచంద్ర రావు, కమిటీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పిచ్చుక ఫణికుమార్, ఆకురాతి జనార్దన్, బాలాజీ, కాలేవు సూరిబాబు, గోరు రాజు, పంచల నరసింహారావు, వాసా గంగాధర రావు, వివిధ చేనేత సంఘాల ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.


