ఎల్‌నినో ప్రభావంతో లోటు వర్షపాతం ఇతర పంటలు వేయాలంటున్న అధికారులు ప్రత్యామ్నాయంగా ప్రీ–మాన్సూన్ డ్రై సోయింగ్ విత్తన గుళికలతో మెరుగైన మొలకలు, తక్కువ నీటి వినియోగం
పెనుగంచిప్రోలు: ఎల్‌నినో ప్రభావం రుతుపవనాలపై ఏర్పడి వర్షపాతంలో భారీగా తేడాలుంటాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే నివేదిక ఇచ్చిన సంగతి విదితమే. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోయి కరువు పరిస్థితులు నెలకొంటాయని అంటున్నారు. ఎల్‌నినో కారణంగా సాధారణం కంటే తక్కువగా లోటు వర్షపాతం నమోదు కానుంది. ఇదే జరిగితే ఖరీఫ్‌లో వర్షాధారంతో సాగయ్యే పంటల పరిస్థితి ఏమవుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రైతులకు భరోసా కల్పించనున్న ప్రీమాన్సూన్ డ్రైసోయింగ్...
వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే తక్కువ వర్షపాత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా అమలు చేస్తున్న ప్రీ–మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్)విధానం రైతులకు కొత్త భరోసాను కల్పిస్తోంది. వర్షాలు ప్రారంభమయ్యే ముందే విత్తనాలు చల్లటం ద్వారా నేలలో తేమ లభించిన వెంటనే మొలకలు రావటం, పంటల పెరుగుదల వేగవంతం కావటం ఈ విధానంలో ప్రత్యేకత. ఒకే పొలంలో 27 నుంచి 30 రకాల పలు పంటల విత్తనాలు సాగు చేయటం వల్ల మట్టి సారం పెరగటంతో పాటు నీటి వినియోగం తగ్గుతుంది. రైతుకు ఒకే పంటపై ఆధారపడకుండా స్థిరమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. మొదట దీర్ఘకాలిక పంటలను విత్తన గుళికలు తయారు చేసి లైన్ సోయింగ్ పద్ధతి ద్వారా నాటుకుని మిగతా 27 నుంచి 30 రకాల విత్తనాలను పొలంలో చల్లుకోవాలి. దీర్ఘకాలిక పంటల్లో కందులు, బొబ్బర్లు, ఆముదాలు, మొక్కజొన్న, గోరుచిక్కుడు, నువ్వులు మొదలైనవి. ఈ పంటలు వర్షాభావ పరిస్థితులకు తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. పొలంలో చల్లిన రైతుకు ఎంతోకొంత ఆదాయం వస్తుంది. వర్షాభావం వలన పశువులకు మేత సమస్య రాకుండా పంటల అవశేషాలను పశువులకు మేత లభించటంతో పాటు పాల దిగుబడి కూడా బాగుంటుంది. రైతులందరూ 27 నుంచి 30 రకాల విత్తనాలను ఎకరానికి 15 నుంచి 20 కిలోల వరకు భూమిలో చల్లుకుంటే భూమి సారం పెరగటమే కాకుండా రైతుకు ఆదాయం కూడా లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటి వరకు పీఎండీఎస్ విధానం ద్వారా 13,622 మంది రైతులకు చెందిన 13,083 ఎకరాల్లో విత్తనాలు నాటారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్వవసాయ పద్ధతులపై దృష్టి పెట్టాలి. ప్రీ–మాన్సూన్ డ్రై సోయింగ్, విత్తన గుళికలు తయారీ విధానం ద్వారా రైతులు ఖర్చులు తగ్గించుకోవటంతో పాటు స్థిరమైన దిగుబడులు, ఆదాయం పొందవచ్చు. రైతులకు ఈ విధానాలపై గ్రామాల్లో అవగాహన కల్పించటంతో పాటు విస్తృతంగా విత్తనాలు విత్తే కార్యక్రమాలు చేపడుతున్నాం.
–వి నాగప్రమీలారాణి,
ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్
విత్తన గుళికల తయారీ కూడా తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు వంటి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటాయి. బీజామృతంతో శుద్ధి చేసిన విత్తనాలపై బంకమట్టి, ఘన జీవామృతం పొడి, కట్టె బూడిదను పొరలు, పొరలుగా కలపటం ద్వారా సాధారణ విత్తనం కంటే పెద్దగా విత్తన గుళికలు తయారవుతాయి. ఇవి పక్షులు, కీటకాల నుంచి రక్షించబడతాయి. మట్టిలో 10 నుంచి 15 మి.మీ వర్షం కురిసినా విత్తనాలు మొలకెత్తుతాయి. తగిన తేమ లేకపోయినా సుమారుగా ఆరు నెలల వరకు జీవంతో ఉండి మొలకెత్తిన తరువాత కూడా నీటి ఎద్దడిని తట్టుకుంటాయని ప్రకృతి వ్యవసాయం ప్రతినిధులు చెబుతున్నారు.


