పిల్లలకు పురుగుల చిక్కీలు! | - | Sakshi
Sakshi News home page

పిల్లలకు పురుగుల చిక్కీలు!

May 20 2026 10:25 AM | Updated on May 20 2026 10:25 AM

పర్యవేక్షణ లోపం..

సమ్మర్‌ క్యాంపుల్లో పిల్లల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటం

హాకీ ఆడే వారికి ఇచ్చిన చిక్కీల్లో పురుగుల గుర్తింపు

నాణ్యత లేనివి పంపిణీ చేయడంపై విమర్శలు

శిబిరాలు ముగిసిపోతున్నా ఇంకా అందని క్రీడాకిట్లు

మా దృష్టికి రాలేదు..

మచిలీపట్నంఅర్బన్‌: పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల నిర్వహణలో నిర్లక్ష్యం వెలుగు చూసింది. వేసవి శిబిరాల్లోని పిల్లలకు నాసిరకం చిక్కీలను పంపిణీ చేస్తూ వారి ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోంది. చిక్కీలను సరైన విధంగా నిల్వ చేయకపోవడం, గడువు ముగిసిన వాటిని పంపిణీ చేయడం, నాణ్యత లేని పదార్థాలను తయారీలో వినియోగించడం వంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

సమ్మర్‌ క్యాంపులు ఇలా..

జిల్లాలోని 40 సమ్మర్‌ క్యాంపుల్లో 22 రకాల క్రీడలను స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపులకు మొత్తం 1,283 మంది క్రీడాకారులు నమోదు చేసుకోగా, వారిలో 494 మంది బాలికలు, 789 మంది బాలురు ఉన్నారు. కోచ్‌లు అందుబాటులో ఉన్న చోట వారి పర్యవేక్షణలో, కోచ్‌లు లేని ప్రాంతాల్లో సీనియర్‌ క్రీడాకారుల సహకారంతో సమ్మర్‌ క్యాంపులు జరుగుతున్నాయి. వీరికి పోషకాహారం నిమిత్తం చిక్కీలను పంపిణీ చేస్తున్నారు. మంగళవారం హాకీ క్రీడాకారులు, చిన్నారులకు పంపిణీ చేసిన బెల్లం–పల్లీ చిక్కీలలో పురుగులు కనిపించాయి. వాటిని చూసిన పిల్లలు షాక్‌కి గురయ్యారు.

ఎక్స్‌పైరీ తేదీపై సందేహాలు..

పంపిణీ చేస్తున్న చిక్కీ ప్యాకెట్లపై స్పష్టమైన ఎక్స్‌పైరీ తేదీలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ‘బెస్ట్‌ బిఫోర్‌’ అనే ముద్రతో మాత్రమే సరుకులను పంపిణీ చేస్తూ నిబంధనల్లో లొసుగులు వినియోగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో నిల్వలో ఉన్న పాత సరుకే పిల్లలకు అందుతున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆట పరికరాల కొరత..

మే 1 నుంచి మే 31 వరకు జిల్లాలో సమ్మర్‌ క్రీడా కోచింగ్‌ క్యాంపులు జరుగుతున్నాయి. జిల్లాలో 1,283 మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నప్పటికీ, ఆట పరికరాల కొరత కారణంగా రోజువారీ హాజరు సుమారు 600 నుంచి 700 వరకు ఉంటుందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఉదయం, సాయంత్రం జరిగే శిక్షణకు సగానికి పైగా క్రీడాకారులు ఆసక్తి చూపడం లేదు. మే 30తో క్యాంపులు ముగియనున్నప్పటికీ ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో క్రీడా పరికరాలు అందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన వ్యవస్థలో నిల్వలు, సరఫరాలపై పర్యవేక్షణ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పోషకాహారం పేరుతో నాసిరకం, పాత పదార్థాలను పంపిణీ చేస్తే ప్రభుత్వ పథకాల లక్ష్యమే ప్రశ్నార్థకమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు నిల్వలపై సమగ్ర తనిఖీలు నిర్వహించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

సమ్మర్‌ క్యాంపుల్లో పంపిణీ చేసిన చిక్కిల్లో పురుగులు ఉన్నాయన్న ఆరోపణలు మా దృష్టికి రాలేదు. ఫ్రెష్‌ స్టాక్‌నే పంపిణీ చేశాం. కొన్ని పరికరాలను ప్రభుత్వం ఇప్పటికే అందించింది. మిగతా అవసరమైన క్రీడా పరికరాల కొనుగోలుకు అనుమతులు ఇచ్చి, ఇందుకు అవసరమైన నిధులను కూడా విడుదల చేసింది. కలెక్టర్‌ అనుమతితో అవసరమైన ఆటపరికరాలను కొనుగోలు చేస్తాం.

– ఝాన్సీ లక్ష్మి, జిల్లా స్పోర్ట్స్‌ అభివృద్ధి అధికారి, మచిలీపట్నం

Advertisement
 
Advertisement
Advertisement