ప్రతి చెరువుకూ ప్రత్యేక కార్యాచరణ | - | Sakshi
Sakshi News home page

ప్రతి చెరువుకూ ప్రత్యేక కార్యాచరణ

May 20 2026 10:25 AM | Updated on May 20 2026 10:25 AM

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): జిల్లాలోని ప్రతి చెరువు పరిస్థితిని పరిశీలించి, అవసరానికి అనుగుణంగా పూడికతీత, బండలు బలపరిచే పనులు, కాలువలు శుభ్రపరిచే కార్యక్రమాలు, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపట్టాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేపడుతున్న జలధార పనులను వేగవంతం చేసి, నిర్ధేశిత లక్ష్యాలకు అనుగుణంగా సమయపాలనతో పూర్తి చేయాలన్నారు. కలెక్టర్‌ లక్ష్మీశ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్‌లో డ్వామా, జల వనరులు తదితర సమన్వయ శాఖల అధికారులతో జలధార– జలహారతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. చెరువుల అభివృద్ధి పనులతో పాటు గొలుసు కట్టు చెరువుల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, రైతులకు సాగునీటి అందుబాటు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని జలధార కార్యక్రమాన్ని ప్రాధాన్యంగా అమలు చేయాలని సూచించా రు. జిల్లాలో మొత్తం 766 పనులు మంజూరు కాగా 578 పనులు ప్రారంభమై పురోగతిలో ఉన్నాయన్నారు. సమావేశంలో డ్వామా పీడీ ఎ.రాము తదితరులు పాల్గొన్నారు.

22న జాబ్‌మేళా

గన్నవరం: స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈ నెల 22న ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్‌మేళాలో ఎఫ్ట్రానిక్స్‌, ఫస్టోర్స్‌ సొల్యూషన్స్‌, హెటిరో ల్యాబ్స్‌, టాటా ఎలక్ట్రానిక్స్‌, ఎన్‌ఎస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, జోయాలుక్కాస్‌, కురాకు ఫైనాన్షియల్‌ సర్వీ సెస్‌, యూనివర్సల్‌ ప్రింట్‌ సిస్టమ్స్‌, టెక్నోటాస్క్‌ బిజినెస్‌ సొల్యూషన్స్‌, వరుణ్‌ మోటర్స్‌ వంటి ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్‌ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్లలోపు అభ్యర్థులు ఈ జాబ్‌మేళాకు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నైపుణ్యం వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలతో రిజిస్టర్‌ చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్‌ పి. నరేష్‌కుమార్‌ సూచించారు. ఇతర సమాచారం కోసం 9676708041, 9494005725లో సంప్రదించాలని పేర్కొన్నారు.

24 నుంచి జాతీయ స్థాయి నాటకోత్సవాలు

గుడివాడ టౌన్‌: కృష్ణా ఆర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ గుడివాడ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి నాటకోత్సవాలను జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు. స్థానిక ఎస్పీఎస్‌ హైస్కూల్‌ ప్రాంగణంలో మంగళవారం నాటకోత్సవాల బ్రోచర్‌లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ అధ్యక్షుడు పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఈనెల 24, 25, 26 తేదీలలో గుడివాడ ఎస్పీఎస్‌ గ్రౌండ్స్‌లో ఈ నాటకోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. మొదటి రోజు మహా పురుషుడు మండలి, రెండో రోజు సాహస, కపిరాజు నాటికలు, మూడో రోజు అమ్మ చెక్కిన బొమ్మ, ఖడ్గ తిక్కన వంటి ప్రదర్శనలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో రంగస్థల దర్శకుడు గంగోత్రి సాయి, అసోసియేషన్‌ కన్వీనర్‌ ఆర్‌వీఎల్‌ నరసింహారావు, కార్యదర్శి ఏఎస్‌వీ ప్రసాద్‌, ఆర్థిక కార్యదర్శి డి.చంద్రశేఖర్‌, సభ్యులు పాల్గొన్నారు.

14 మంది విద్యుత్‌ ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు

చిలకలపూడి(మచిలీపట్నం): విద్యుత్‌ ఉద్యోగుల సహకార పరపతి సంఘంలో భారీగా అవకతవకలు జరిగాయని ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘వెలుగు నిధులపై కమ్ముకున్న చీకట్లు’ అనే కథనానికి విద్యుత్‌ శాఖాధికారులు స్పందించారు. ఇందుకు సంబంధించి అవకతవకలకు కారణమైన 14 మంది విద్యుత్‌ ఉద్యోగులపై వేటు పడింది. విద్యుత్‌ ఉద్యోగుల సహకార పరపతి సంఘంలో సభ్యులు దాచుకున్న రూ.100కోట్ల మేర సొమ్ము దుర్వినియోగం చేసినట్లు వచ్చిన వార్తా కథనంపై సోమవారం రాత్రి సహకార శాఖాధికారులు ఇచ్చిన సంఘ సభ్యుల పేర్లు ఆధారంగా వారిని సస్పెండ్‌ చేశారు. వీరిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement