యూరియా సరఫరాపై సమావేశంలో కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం యూరియా పంపిణీ చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశం హాలులో మంగళవారం ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, జేసీ నవీన్‌లతో కలిసి వ్యవసాయశాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని యూరియాను పకడ్బందీగా పంపిణీ చేయాలన్నారు. ప్రతి రైతుకు వరి పంటకు అవసరమైన యూరియాను ఒకేసారి కాకుండా మూడుదశలతో సరఫరా చేయాలన్నారు. ఆ మేరకు మాత్రమే యూరియాను రైతు సేవా కేంద్రాలు, సహకార పరపతి సంఘాలలో అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి రైతుకు ఈ పంట నమోదు ప్రకారం ఎకరానికి రెండు బస్తాలు చొప్పున అందజేయాలన్నారు. చిన్న,సన్నకారు రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ జిల్లాలోని 326 రైతు సేవా కేంద్రాలు, 185 సహకార సంఘాలున్నాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో 4,600 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందన్నారు. జిల్లా వ్యవసాయశాఖాధికారి ఎన్. పద్మావతి, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీ కిషోర్, జిల్లా ఉద్యాన శాఖాధికారి జె. జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


