మంత్రి కొల్లు రవీంద్ర
చిలకలపూడి(మచిలీపట్నం): మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ‘మత్స్యకారుల సేవలో’ కార్యక్రమానికి సంబంధించి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 18,157 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ రూ.20వేలు చొప్పున రూ.36.31కోట్లను అందజేశామన్నారు. మత్స్యకారులు వేట నిషేధ సమయంలో జీవన భృతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నగదును అందజేస్తున్నామన్నారు. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మత్స్యకారులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిధులను వారి ఖాతాలలో జమ చేస్తున్నామని పేర్కొన్నారు. కలెక్టర్ డీకే బాలాజీ, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, మత్స్యశాఖ జేడీ ఎ. నాగరాజు, బందరు మార్కెట్ యార్డు చైర్మన్ కుంచె నాని తదితరులు పాల్గొన్నారు.


