దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3.35 కోట్లు | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3.35 కోట్లు

May 19 2026 1:46 AM | Updated on May 19 2026 1:46 AM

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3.35 కోట్లు వేదాద్రి ఆలయానికి రూ.25.50 లక్షల ఆదాయం ఎల్‌నినో పుస్తక ఆవిష్కరణ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.3.35 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 16 రోజులకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ప్రాంగణంలో హుండీల ద్వారా రూ.3,35,87,555 నగదు, 232 గ్రాముల బంగారం, 4.200 కిలోల వెండి లభించాయని ఆలయ ఈఓ శీనానాయక్‌ తెలిపారు. 1,174 యూఎస్‌ఏ డాలర్లు, 53 ఖతార్‌ రియాల్స్‌, 117 మలేషియా రింగట్స్‌, 175 యూఏఈ దిర్హమ్స్‌, 300 ఓమన్‌ బైంసాలు, 1000 ఉగాండా షిలింగ్స్‌తో పాటు పలు దేశాల కరెన్సీ లభించింది. కానుకల లెక్కింపును ఈఓ శీనానాయక్‌, ఆలయ చైర్మన్‌ రాధాకృష్ణ, పలు వురు ట్రస్ట్‌ బోర్డు సభ్యులు పర్యవేక్షించారు. లెక్కింపులో సేవా సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొనగా, ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది, వన్‌టౌన్‌ పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

జగ్గయ్యపేట: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి బహిరంగ వేలం ద్వారా రూ.25.50 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ సురేష్‌బాబు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో తలనీలాలు పోగు చేసుకునేందుకు, పొంగళి షెడ్డు నిర్వహణకు సోమవారం బహిరంగ వేలం నిర్వహించారు. తలనీలాలు పోగు చేసుకునే హక్కు వేలంలో రూ.22 లక్షలు, పొంగళి షెడ్డు నిర్వహణ వేలంలో రూ.3.50 లక్షల ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది తలనీలాలు పోగు చేసుకునే హక్కుకు రూ.6.94 లక్షల ఆదాయం అదనంగా వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్‌స్పెక్టర్‌ పవన్‌ కల్యాణ్‌, కేసీపీ ప్రతినిధి గోవింద్‌, సిబ్బంది రత్నాకర్‌, నాగార్జున, సుదర్శన్‌ పాల్గొన్నారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో కలిసి ఎల్‌నినో పుస్తకాన్ని ఆవిష్కరించారు. వాతావరణ మార్పుల ప్రభావం, ఎల్‌నినో వల్ల వ్యవసాయ రంగంపై పడే ప్రభావాలు, రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఈ పుస్తకం అవగాహన కల్పిస్తుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. వాతావరణ మార్పులకు అనుకూలంగా విత్తన గుళికలు చేసి ప్రీ మాన్సూన్‌ డ్రై సోయింగ్‌ ప్రధాన పంటగా వేసుకోవాలని సూచించారు. జిల్లాలోని రైతులు పుస్తకంలోని సూచనలను పాటించడం ద్వారా పంటల నష్టాలను తగ్గించుకోవడంతో పాటు స్థిరమైన వ్యవసాయాన్ని సాధించగలరని అధికారులు పేర్కొన్నారు.

ఎన్టీటీపీఎస్‌లో

వందరోజుల వేడుక

ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్‌ నాలుగో యూనిట్‌ నిరంతరాయంగా 100 రోజులపాటు విద్యుత్‌ ఉత్పత్తి జరిగిన నేపథ్యంలో సోమవారం అధికారులు వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్‌ ఇంజినీర్‌ పి.శివ రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై కేక్‌ కట్‌ చేశారు. నాలుగో యూనిట్‌లో విశిష్ట విజయానికి కృషి చేసిన అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. నిరంతర విద్యుత్‌ ఉత్పత్తి సాధనలో ఉద్యోగుల సమన్వయం, అంకితభావం, సాంకేతిక నైపుణ్యం కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. సంస్థలో అన్ని యూనిట్లు ఇదే ఒరవడిలో విజయవంతంగా కొనసాగేలా కృషి చేయాలని సీనియర్‌ ఇంజినీర్లకు సూచించారు. పలువురు అధికారులు, ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement