ప్రైవేట్‌ టీచర్లకు అడ్మిషన్ల సెగ | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ టీచర్లకు అడ్మిషన్ల సెగ

May 19 2026 1:46 AM | Updated on May 19 2026 1:46 AM

టార్గెట్‌ పూర్తయితేనే ఉద్యోగం

విద్యార్థులను చేర్చాలని ప్రైవేట్‌ స్కూళ్ల టీచర్లకు టార్గెట్లు ఒక్కొక్కరు 10 నుంచి 15 అడ్మిషన్లు చేయాలని ఒత్తిడి మనోవేదనకు గురవుతున్న ప్రైవేట్‌ ఉపాధ్యాయులు

పెనుగంచిప్రోలు: ప్రైవేట్‌ టీచర్లకు అడ్మిషన్ల అగచాట్లు తప్పటం లేదు. ఒక పక్క మండే ఎండలకు తోడు ఉక్కపోతతో అల్లాడుతుంటే మరో పక్క అడ్మిషన్ల టార్గెట్లు మరింత వేడిని పుట్టిస్తున్నాయి. కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు టార్గెట్లు విధించి మరీ ఉపాధ్యాయులను ఇళ్ల వెంట పరుగులు పెట్టిస్తున్నాయి. మరికొన్ని పాఠశాలల యాజమాన్యాలు తమ వద్ద పనిచేస్తున్న టీచర్లను బస్సుల్లో పల్లెలకు తీసుకెళ్లి కరపత్రాల ద్వారా ప్రచారం చేయించటంతో పాటు అడ్మిషన్లు చేయించేలా ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు లేక జీవనం సాగించటానికి ఎంతో మంది పీజీ, డిగ్రీ, బీఈడీలు చేసిన వారు ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు, వత్సవాయి, జగ్గయ్యపేట మండలాల్లో సుమారుగా 50 వరకు ప్రైవేటు పాఠశాలలు, 12 కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. వీటిలో వెయ్యి మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలు గత నెల నుంచి ఆయా పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఇంటింటికీ పంపిస్తున్నాయి. వారు ప్రతి ఇంటికి వెళ్లి ‘మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారా? ఏం చదువుతున్నారు? మా పాఠశాలలో, కళాశాలలో చేర్పించండి’ అంటూ బతిమలాడుతున్నారు. తమ వద్ద ఎన్నో వసతులు ఉన్నాయని, ఉత్తమ విద్యాబోధన అందుతుందని, మెరుగైన ఫలితాలు తెప్పిస్తామంటూ తల్లిదండ్రులను ప్రలోభపెడుతున్నారు.

సతమతమవుతున్న సిబ్బంది

ఒకవైపు బోధన, మరోవైపు టార్గెట్‌ను పూర్తిచేసే పనిలో ప్రైవేటు, కార్పొరేట్‌ ఉపాధ్యాయులు, అధ్యాపకులు తీవ్ర వత్తిడికి లోనై మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నారని విద్యావేత్తలు చెబుతున్నారు. తమ వేదనను ఎవరికీ చెప్పుకోలేక లోలోపల కుమిలి పోతున్నారు. చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్న సమయంలో ఉన్న ఉద్యోగాన్ని వదులుకోలేక, అక్కడే కొనసాగలేక ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు యాజమాన్యాలు చాలీచాలని వేతనాలిస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులు వాపోతున్నారు.

ఇచ్చిన అడ్మిషన్ల టార్గెట్లు పూర్తి చేస్తేనే సెలవుల్లో జీతాలు ఇస్తామని, ఆపై సంవత్సరం ఉద్యో గంలో కొనసాగిస్తామని కొన్ని కార్పొరేట్‌ పాఠశాలలు నిబంధనలు పెడుతున్నాయి. ఒక్కొక్కరు కనీసం 10 నుంచి 15 మంది పిల్లలను పాఠశాలల్లో చేర్పించాల్సిందేనని స్పష్టంచేస్తున్నాయి. అలా చేర్పించిన తరువాత కూడా సెలవుల అనంతరం పాఠశాల తెరిచిన తరువాత ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో గ్యారెంటీ లేదు. ఇచ్చే అరకొర జీతాలు నిలిపి వేస్తారనే భయంతో ఉపాధ్యాయులు, సిబ్బంది నానాతంటాలు పడుతుంటారు. భగభగ మండే ఎండల్లో ఇంటింటికి తిరుగుతూ విద్యార్థుల కోసం జల్లెడపడుతున్నారు. అడ్మిషన్ల కోసం కొన్ని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు నోటికి ఏది వస్తే అది మాట్లాడి తమ మనోభావాలు దెబ్బతీస్తున్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement