అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం

May 19 2026 1:46 AM | Updated on May 19 2026 1:46 AM

అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం

కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాలాజీ పీజీఆర్‌ఎస్‌లో 135 అర్జీలు స్వీకరణ

చిలకలపూడి(మచిలీపట్నం): వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశం హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కారవేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం జరిగింది. కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, మెప్మా పీడీ సాయిబాబు, సమగ్ర శిక్ష ఏపీసీ కుముదినిసింగ్‌, డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. జిల్లాలో 50 శాతానికి పైగా పనులు జరిగి అసంపూర్తిగా మిగిలిపోయిన భవనాలను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు కోసం అంచనాలను రూపొందించాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. ఇకపై ఏ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించినా ఫ్లెక్సీలకు కాకుండా గుడ్డతో తయారు చేసిన బ్యానర్‌ను మాత్రమే ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా పర్యవరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలని కోరారు. జిల్లాలో ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న విజయగాథలను తయారు చేసి నివేదిక అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై మొత్తం 135 అర్జీలు అందాయి. కోడూరు మండలం ఉల్లిపాలెం శివారు శ్రీరామాపురం గ్రామంలో తనకు ఎకరం భూమి ఉందని, రత్నకోడు మేజర్‌ డ్రయిన్‌ నుంచి అక్రమంగా పైపులైను ఏర్పాటు వల్ల పొలాలు ముంపు బారిన పడుతున్నాయని నడకుదిటి నారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. అక్రమ పైపులైన్లను తొలగించి న్యాయం చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement