మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించామని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్, ఐటీఐ కౌన్సెలింగ్ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం.కనకారావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతితో పాటుగా ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులు అయిన వారికి కూడా ఐటీఐ కోర్సుల్లో ప్రవేశానికి అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో చేరాలనుకునే వారు జూన్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా ఐటీఐఅడ్మిషన్స్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు. దరఖాస్తు చేసిన విద్యార్థులు జూలై 2వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు వారికి సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు వెళ్లి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసుకోవాలని వివరించారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయిన వారే కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి అర్హులని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. ఆన్‌లైన్‌లో వివరాలు పూర్తి చేసేటప్పుడు తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అభ్యర్థులకు సూచించారు. ఇతర వివరాలకు 94906 39639లో సంప్రదించాల్సిందిగా కనకారావు కోరారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని బందరురోడ్డులో ఉన్న ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం(ఐజీఎంసీ) ఆవరణలో ఈ నెల 20, 21 తేదీల్లో వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్‌లో జిల్లా స్థాయి పోటీలను నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్‌డీవో) కె.కోటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు వెయిట్ లిఫ్టింగ్‌లో అండర్–17, అండర్–20 బాలబాలికలు విభాగాలకు పోటీలు, 21వ తేదీ గురువారం ఉదయం 7 గంటలకు అండర్–16 బాలబాలికలకు హైజంప్ అండ్ లాంగ్ జంప్, జావెలిన్ పోటీలు, అండర్–20 బాలబాలికలకు 100, 400, 800 మీటర్ల హైజంప్ అండ్ లాంగ్ జంప్, జావెలిన్, రిలే పరుగుపందెం పోటీలను నిర్వహిస్తామని వివరించారు. వివరాలకు వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు 63002 75294, అథ్లెటిక్స్ క్రీడాకారులు 63028 22291లో సంప్రదించాల్సిందిగా కోరారు. స్పోర్ట్స్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో క్రీడాకారులు వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీ కోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఎటువంటి భయం లేకుండా తమ సమస్యలను పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతి ఫిర్యాదుపై పారదర్శకంగా విచారణ నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం ఆయన ఫిర్యాదుదారులతో ముఖాముఖీ మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్ అధికారులతో నేరుగా మాట్లాడి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మీ కోసం కార్యక్రమంలో మొత్తం 40 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు.


