కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో ఎస్‌ఎస్‌సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీతో పాటు ఓపెన్ స్కూల్ (ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియెట్) సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సోమవారం జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు ఈ నెల 25 నుంచి జూన్ 4 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,313 మంది ఎస్‌ఎస్‌సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ విద్యార్థులు, 575 మంది ఓపెన్ ఎస్‌ఎస్‌సీ విద్యార్థులు, 1,103 మంది ఓపెన్ ఇంటర్మీడియెట్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని చెప్పారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 17 ఎస్‌ఎస్‌సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాలు, 5 ఓపెన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద భద్రత, విద్యార్థులకు రవాణా సౌకర్యం, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య సహాయం తదితర అంశాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సమావేశంలో పోలీసు, రెవెన్యూ, ఆర్టీసీ, పోస్టల్, విద్యుత్, వైద్య ఆరోగ్య, రవాణా శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొని పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు.


