పటమట(విజయవాడతూర్పు): జాతీయ స్థాయిలో వీఎంసీ వ్యర్థ పదార్థాల నిర్వహణ విధానంపై ప్రదర్శన ఇవ్వనున్నామని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో ఆయన మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన స్వచ్ఛ భారత్‌కు సంబంధించిన జాతీయ స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో శాఖాధిపతులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ స్థాయి సమావేశంలో వివిధ నగర పాలక సంస్థల కమిషనర్లు సమర్పించాల్సిన అంశాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా నగరాల్లో అమలు చేస్తున్న పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థ పదార్థాల శాసీ్త్రయ నిర్వహణ, ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న స్వచ్ఛ కార్యక్రమాలు, సుస్థిర పట్టణ అభివృద్ధి వంటి అంశాలపై ప్రదర్శనలు ఇవ్వాలని కేంద్ర మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ మేరకు ఆయన త్వరలోనే ప్రదర్శన ఏర్పాటు చేస్తామని కేంద్ర బృందానికి తెలిపారు. సమావేశంలో అదనపు కమిషనర్లు డాక్టర్ డి. చంద్రశేఖర్, ఏ. రవీంద్రరావు, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, చీఫ్ ఇంజినీర్ (ఇన్‌చార్జ్) సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు.
త్వరలో ఏర్పాటు చేస్తామన్న వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర


