కలెక్టర్‌ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

May 19 2026 1:40 AM | Updated on May 19 2026 1:40 AM

కలెక్టర్‌ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

మచిలీపట్నంఅర్బన్‌: కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో సోమ వారం నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్క మృతిపై న్యాయం చేయాలంటూ అద్దంకి సంధ్యారాణి (30) కలెక్టర్‌ డీకే బాలాజీ ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్‌కు అర్జీ ఇవ్వడానికి ఆమె ‘మీ కోసం’ కార్యక్రమానికి హాజరయ్యారు. అర్జీ స్వీకరించేలోపే ఆమె తనతో తెచ్చుకున్న పురుగుల మందు తాగే ప్రయత్నం చేయగా, అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి అడ్డుకున్నారు. అనంతరం ఆమె వద్ద ఉన్న పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకుని, విచారణ నిమిత్తం చిలకలపూడి పీఎస్‌కు తరలించారు.

అక్క మృతిపై అనుమానాలు..

ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ కొందరు పెద్ద మనుషులు డబ్బులు తీసుకుని తన అక్క సుధగాని సుధారాణి మృతిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఎన్నిసార్లు అర్జీలు సమర్పించినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని పేర్కొంటూ తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. కర్రి మహేష్‌, నాగరాజు, కుంబ పాండు, నాగార్జున తదితరుల వద్ద నుంచి రూ.2లక్షలు తీసుకుని కేసును తప్పుదారి పట్టించారని ఆరోపిస్తూ, కేసుపై మళ్లీ విచారణ నిర్వహించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement