వదనం... వికసిత కమలం
లబ్బీపేట(విజయవాడతూర్పు): నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న వారిని చూస్తుంటాం. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురైనప్పుడు హెల్మెట్ ఉంటే పర్వాలేదు. లేకుంటే ముఖ ఎముకలు గాయాలవుతున్న వారు ఇటీవల కాలంలో ఎక్కువగా ఉంటున్నారు. అలాంటి వారికి విరిగిన ఎముకలను మళ్లీ సాధారణ స్థితికి తీసుకు రావడంలో మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ కీలకంగా మారారు. అంతేకాదు గ్రహణం మొర్రితో పుట్టిన చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేసి, వారి ముఖాల్లో చిరునవ్వులు చిందేలా చేస్తున్నారు. అంద విహీనంగా ఉన్న ముఖాన్ని కాస్మోటిక్ సర్జరీలు చేసి, అందంగా ఉండేలా చేస్తున్నారు. ఇలా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, నోటి క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ సర్జరీలు ఇప్పుడు మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ అలవోకగా చేసేస్తున్నారు. ఇలా వైద్య రంగంలో కీలకంగా మారారు. ఆయా శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు నేషనల్ మెడికల్ కమిషన్, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 13 అంతర్జాతీయ మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం...
ఏటా 500కు పైగా శస్త్ర చికిత్సలు
ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రతి ఏటా 500 మందికి పైగా వ్యక్తులకు రోడ్డు ప్రమాదాల్లో ముఖ ఎముకలు ఫ్యాక్చర్స్ అవుతున్నాయి. వారికి మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ శస్త్ర చికిత్సలు చేసి వాటిని సరి చేస్తున్నారు. ముఖంలోని ఏ ప్రాంతంలో ఎముక విరిగినా అత్యంత చాకచక్యంగా సర్జరీలు చేసేస్తున్నారు. ఇటీవల కాలంలో హెడ్ అండ్ నెక్ సర్జరీలు సైతం ఎక్కువమందికి అవసరం అవుతున్నాయి. ముఖ దవడ మీద కణితులు రావడం, గొంతులో కణితులు వంటి వాటికి కూడా విజయవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు.
పెరుగుతున్న నోటి క్యాన్సర్
ఉమ్మడి కృష్ణాలో రోజురోజుకు నోటి క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. టుబాకో, పచ్చి వక్క లు, సున్నం వేసిన తమలపాకులు, పాన్‌పరాగ్, గుట్కా, జర్దా కిళ్లీలు, హుక్కా, అడ్డ పొగ సేవనం, బీడీలు, చుట్ట, సిగరెట్, హుక్కాలు తాగే వారికి ఎక్కువగా నోటి క్యాన్సర్ సోకుతుంది. కొందరు పాన్‌పరాగ్, గుట్కా నమిలిన తర్వాత రాత్రి వేళల్లో అలాగే నిద్రిస్తారు. అలాంటివారు త్వరగా నోటి క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. జిల్లాలో నమోదవుతున్న ఓరల్ క్యాన్సర్‌లలో నాలుక, పెదవి, అంగడి, బుగ్గ క్యాన్సర్‌లు ఎక్కువగా ఉంటున్నాయి. ఏటా 700 వరకూ నోటి క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా, వారికి మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ విజయవంతంగా శస్త్ర చికిత్సలను నిర్వహిస్తున్నారు.
రూపు రేఖలు మార్చేస్తారు
ప్రస్తుతం మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ కాస్మోటిక్ సర్జరీలు చేసేందుకు డీసీఐ అనుమతిచ్చింది. దీంతో ఫేషియల్ కాస్మోటిక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ముక్కు వంకరగా ఉన్నా, నుదిరు సరిగా లేకున్నా, దవడ రూపం బాగా లేకున్నా వాటి రూపురేఖలు మార్చేసి అందంగా ఉండేలా చేస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు ఫేషియల్ సర్జన్స్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసేందుకు సైతం డీసీఐ అనుమతి ఇచ్చింది. ఇలా కాస్మోటిక్, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి శస్త్ర చికత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
విరిగిన ముఖ ఎముకలు.. సరిచేసేస్తారు!
ఏటా రోడ్డు ప్రమాదాల్లో 500కు పైగా ముఖ ఎముకల ఫ్యాక్చర్స్
నోటి క్యాన్సర్‌కు అధునాతన
శస్త్ర చికిత్సలు
గ్రహణం మొర్రి చిన్నారుల్లో సైతం
చిరునవ్వులు పూయిస్తారు
ముఖాన్ని అందంగా మార్చేందుకు కాస్మోటిక్స్ సర్జరీలు
వైద్య రంగంలో మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ కీలకంగా మారిన వైనం
నేడు అంతర్జాతీయ మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ డే
వదనం... వికసిత కమలం
వదనం... వికసిత కమలం


