రీ సర్వే పనులు సమయానికి పూర్తి చేయాలి
రామవరప్పాడు: గ్రామాల్లో చేపట్టిన రీ సర్వే ప్రాజెక్టు పనులను నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని సర్వే, సెటిల్‌మెంట్ అండ్ భూరికార్డుల డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు సచివాలయంలో గురువారం రీ సర్వేకు సంబంధించిన పనులు, రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూర్మనాథ్ ఎల్‌పీఎం వెక్టరైజేషన్, లాగిన్ డేటా పనులను పరిశీలించారు. జీటీ అయిన వెంటనే సమాంతరంగా వెక్టరైజేషన్ పనులు పూర్తి చేయాలన్నారు. జీటీ సమయంలో ప్రతి రైతుకు ముందుగానే తెలియపరిచి ఈకేవైసీ యాప్ ద్వారా నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో రీజనల్ జాయింట్ డైరెక్టర్ సీహెచ్‌వీఎస్‌ఎన్ కుమార్, సర్వే ఏడీ మోహనరావు, విజయవాడ తహసీల్దార్ సుగుణ, డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే సుబ్బారావు, హుమయూన్ బేగ్, సర్వేయర్లు, వీఆర్ వోలు పాల్గొన్నారు.
చల్లపల్లి: ఏపీ పశుసంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి సంస్థ, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంఘం, రాష్ట్రీయ గోయల్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో మండల పరిధిలోని లక్ష్మీపురం పశువైద్యశాల వద్ద గురువారం పెయ్యి లేగదూడల అందాల ప్రదర్శన పోటీలు ఏర్పాటుచేశారు. 40 లేగదూడలు పోటీల్లో పాల్గొన్నాయి. పోటీల్లో చిగురుపల్లి పాపారావు, యడ్లపాటి ముక్తేశ్వరరావు, దోనేపూడి నరసింహారావులకు చెందిన లేగదూడలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించాయి. పశుసంవర్థక శాఖ డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్.నాగభూషణం, చల్లపల్లి ఏడీ డాక్టర్ కేసీవీ రెడ్డి, మండల పశువైద్యాధికారి ఎం.నందకిషోర్, గన్నవరం డీఎల్‌డీఏ డాక్టర్ పి.రాధిక న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
చిన జీయర్ స్వామి
హనుమాన్‌జంక్షన్ రూరల్: సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు గానూ ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులను విజయ డెయిరీ పార్లర్ ద్వారా విక్రయించేందుకు కృష్ణా మిల్క్ యూనియన్ ముందుకు రావటం అభినందనీయమని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి అన్నారు. బాపులపాడు మండలం వీరవల్లిలోని కృష్ణా మిల్క్ యూనియన్ కామథేను పాల ఫ్యాక్టరీని గురువారం ఆయన సందర్శించారు. చిన జీయర్ స్వామి చేపట్టిన ‘సుఫల రైతు యాత్ర’లో భాగంగా ఇక్కడకు విచ్చేసిన ఆయన ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. కృత్రిమ ఎరువుల వినియోగంతో నేల, ఆహారం, వాతావరణం పూర్తిగా కలుషితమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగించకుండా సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తామని రైతులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ మార్గదర్శకాల మేరకు సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అవలంభించే రైతులకు బాసటగా నిలుస్తామని యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు చెప్పారు. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ అధికారి మహేష్, కృష్ణా మిల్క్ యూనియన్ ఎండీ కొల్లి ఈశ్వరబాబు, పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం చిన జీయర్ స్వామి హనుమాన్‌జంక్షన్‌లోని ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్థానం, శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానాలను దర్శించారు.
మంగళగిరి టౌన్ : భారతీయ చారిత్రక వారసత్వాన్ని భద్రపరిచే దిశగా భారత్‌శ్రీ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో చైన్నె పురావస్తు, పురాతత్వ శాఖ శాసన విభాగ బృందం శిలాశాసనాల డిజిటలైజేషన్ కార్యక్రమానికి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో గురువారం శ్రీకారం చుట్టారు. ఈ దేవస్థానంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చైన్నె, ఎపిగ్రాఫీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. ఏసుబాబు బృందం శ్రీకృష్ణదేవరాయల హయాం నుంచి 18వ శతాబ్దం వరకు శిలాశాసనాలను అధ్యయనం చేశారు.
● ఏసుబాబు మాట్లాడుతూ విజయవాడ కనకదుర్గ ఆలయం వద్ద అక్కన్న, మాదన్న గుహల శిలాశాసనాలు, పాత శివాలయం వద్ద శాసనాలను అధ్యయనం చేశామని పేర్కొన్నారు.
● పురాతన దేవాలయాలు, శిలా నిర్మాణాలు, కోటలు, ఇతర చారిత్రక కట్టడాలపై శాసనాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ రూపంలో భద్రపర్చడం కార్యక్రమ ఉద్దేశమన్నారు.
● శిలాశాసనాల లిపి ఆధారంగా స్థానిక భాషల్లో అనువదింపజేస్తామన్నారు. చెదిరిపోతున్న అక్షరాలను స్పష్టంగా గుర్తించి డేటాబేస్ లో నమోదు చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు ఈ శాసనాలు అందుబాటులో ఉంటాయన్నారు.
● మంగళగిరి పరిధిలోని చారిత్రక ఆధారాలు, శిలాశాసనాలను అధ్యయనం చేసి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన అధికారులకు నివేదిక అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
రీ సర్వే పనులు సమయానికి పూర్తి చేయాలి


