ప్రభల పండుగకు ఘనంగా ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ప్రభల పండుగకు ఘనంగా ఏర్పాట్లు

Feb 13 2026 5:35 AM | Updated on Feb 13 2026 5:35 AM

ప్రభల పండుగకు ఘనంగా ఏర్పాట్లు

ప్రభల పండుగకు ఘనంగా ఏర్పాట్లు

యనమలకుదురు కొండపై

రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు

15వ తేదీ రాత్రి

శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం

పెనమలూరు: యనమలకుదురులో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. గ్రామంలో మహాశివరాత్రి ప్రభోత్సవం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ నిర్వహిస్తారు. ఒకే సారి దాదాపు 60 ప్రభలతో కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. లక్షల్లో భక్తులు శ్రీరామలింగేశ్వరస్వామి దర్శనానికి వస్తారు.

నందీముద్దలు–గండదీపం

భక్తులు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున మొక్కులు తీర్చుకుంటారు. శ్రీరామలింగేశ్వరుడు మహాశక్తివంతుడని భక్తులకు ప్రగాఢ నమ్మకం. పిల్లలు పుట్టని వారు సంతానం కోసం భక్తులు ధ్వజస్తంభానికి వస్త్రాలు కప్పి నందీముద్దలు (పులగం)పైకి విసురుతారు. అవి చీరకొంగులో పడితే వారికి పిల్లలు పుడతారని నమ్మకం. అలాగే కొండ పైకి ఉన్న మెట్లను కడిగి పసుపు కుంకుమ రాసి మొక్కులు తీర్చుకుంటారు. గండదీపం తలపై పెట్టి నేలపై చీరలు పరిచి ఆ చీరల పై నడుచుకుంటూ కొండ పైకి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయంలో హనుమంతుడు, నాగేంద్రస్వామి, వీరభద్రుడు, దక్షిణ మూర్తి, చండీశ్వరుడు, నందీశ్వరుడు, నవగ్రహాలు, సప్తమాత్రికులు, సుబ్రహ్మణ్యస్వామి ఇలా అనేక మంది దేవతామూర్తులు కొలువై ఉన్నారు. భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్య స్నానాలు చేయటానికి ఏర్పాట్లు చేశారు.

ప్రత్యేక ఆకర్షణగా ప్రభల ప్రదర్శన

మహాశివరాత్రి ఉత్సవాల్లో ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దేవుడి ప్రభతో పాటు కొండ చుట్టూ దాదాపు 60 ప్రభలు రంగురంగుల దీపాలతో అలంకరించి రాతి చక్రాల రథంపై ఉంచి తిప్పుతారు. ప్రభలు 70 అడుగుల ఎత్తులో ఉంటాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున ప్రభలు ఒకేసారి గిరి ప్రదక్షిణ చేయటం ఇక్కడే జరుగుతుంది. రాధాకృష్ణ కోలాటం, కోయ, హరిణి నృత్యాలు, భేతాళ వేషాలు, ఇలా అనేక కార్యక్రమాలు ప్రభోత్సవంలో నిర్వహిస్తారు.

మహాశివరాత్రి కార్యక్రమం వివరాలు...

ఇక్కడ శివరాత్రి మహోత్సవాలు ఈ నెల 14వ తేదీన ప్రారంభమవుతాయి. ఉదయం 8 గంటలకు స్వామివార్లను పెళ్లి కుమారుడు, పెళ్లికుమార్తెను చేస్తారు. 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి విశేష అభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజ, దర్శనం, 11 గంటలకు దేవుడి ప్రభ ఊరేగింపు, మండపం వద్ద బహిరంగ వేలం పాట ఉంటుంది. మధ్యాహ్నం నుంచి పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభల ఊరేగింపు చేస్తారు. అర్థరాత్రి 2.16 గంటలకు స్వామివారికి కల్యాణం నేరెళ్ల సత్య వెంకట నారాయణ దంపతులు చేస్తారు. 16వ తేదీ ఉదయం 10 గంటలకు ఉదయం గ్రామోత్సవం, 17వ తేదీ ఉదయం వసంతోత్సవం, త్రిశూలస్నానం, నందీముద్దలు, రాత్రి స్వామివారి పవళింపుసేవ జరుపుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement