ఘంటసాల శయన ప్రాజెక్టు నిర్మాణానికి కృషి
మంత్రి కందుల దుర్గేష్
ఘంటసాల: కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఘంటసాల శయన ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఘంటసాల గ్రామంలోని బౌద్ధ స్థూపం వద్ద బుద్ధుని జయంతి వేడుకలు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు రేగుళ్ల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో సోమ వారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బౌద్ధ పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా కేంద్ర ప్రభుత్వం సహకారంతో పర్యాటక రంగం అభివృద్ధి చేస్తామన్నారు. నేటి సమాజంలో బుద్ధని బోధనలు అనుసరణీయమన్నారు. బౌద్ధ భిక్షువు భంతే ధమ్మ ధజ థెరోతో కలసి మంత్రి దుర్గేష్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రవీంద్ర కుమార్ డప్పువాయిద్యాలు, నృత్య కళాకారులతో కలసి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం బౌద్ధ భిక్షువులు, కార్యక్రమానికి సహకరించిన ప్రజా ప్రతినిధులు, అధికారులను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. జిల్లాలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన ఘంటసాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. బుద్ధ విహార్ వద్ద బుద్ధ జయంతి ఉత్సవాలను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు రేగుళ్ల మల్లికార్జునరావులతో కలసి గీతాంజలి శర్మ ప్రారంభించారు. ఉత్సవంలో భాగంగా జరిగిన రెండు సదస్సుల్లో బౌద్ధ శాసనాలు, బౌద్ధ నాటకాలు, ఘంటసాల బ్రహ్మీ శాసనాలు, నాటకాలు, సామాజిక ప్రగతి తదితర విషయాలను చర్చించారు. ఈ కార్యక్రమాల్లో మెప్మా పీడీ సాయిబాబు, డీసీ చైర్మన్ భాను ప్రకాష్, తహసీల్దార్ బి.విజయప్రసాద్, ఎంపీడీఓ డి.సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.


