పొగ పెట్టేది.. మంట రాజేసేది బాబే? | - | Sakshi
Sakshi News home page

పొగ పెట్టేది.. మంట రాజేసేది బాబే?

Dec 30 2023 1:44 AM | Updated on Dec 30 2023 8:19 AM

- - Sakshi

తెలుగుదేశం పార్టీకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఆరో వేలితో సమానమా.. అనే ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది.

నియోజకవర్గ నాయకుల మధ్య నిత్యం రగడ రగులుకుంటూ ఉండటానికి కారణం అధిష్టానమా... అంటే అదే నిజమనిపిస్తోంది.

కేశినేని శ్రీనివాస్‌ (నాని), బుద్ధా వెంకన్న, నాగుల్‌మీరా తదితర నాయకులు, వారి బృందాలు వైరి వర్గాలుగా కొనసాగుతుండటానికి బాధ్యులెవరంటే.. అన్ని వేళ్లూ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ల వైపే.. అని ఆ పార్టీ సీనియర్లు, రాజకీయ విశ్లేషకులు స్పష్టంగా అంటున్నారు. టీడీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అవసరం లేనిది(ఆరోవేలు) గానే చూస్తుంటుందనేది జవాబు.

సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్‌ను తోసేసి పార్టీని ఆక్రమించేసుకున్నప్పటి నుంచి పశ్చిమ నియోజకవర్గం బాబుకు ఒక ఆప్షన్‌ మాత్రమే అనేది నిరూపితమైనదే. ఏ పార్టీతో రాజకీయ అవగాహన కుదిరినా ఆ స్థానాన్ని అలవోకగా కేటాయించేస్తున్నారు. ఆ స్థానాన్ని ఆశించే పార్టీల వాస్తవ బలాబలాలు ఎలాగున్నా.. రెండు పరస్పర వైరి సిద్ధాంతాలు కలిగిన పార్టీలకై నా సరే ఇచ్చేస్తున్నారు. వామపక్షాలకు, బీజేపీకి పశ్చిమాన్ని ఇచ్చేయడమే ఇందుకు నిదర్శనం. రానున్న ఎన్నికల్లో తమకు ఈ సీటు దాదాపు రిజర్వు అయ్యిందనేది జనసేన నుంచి బలంగా వినిపిస్తున్న మాట. రాజకీయవర్గాల్లో విస్తృతంగా జరుగుతున్న ప్రచారం కూడా.

తాంబూలాలిచ్చాం.. తన్నుకు చావండి..
పశ్చిమ నియోజకవర్గంలోని నాయకుల మధ్య తగువులు పెట్టేది, వారిని ప్రోత్సహించేది అధిష్టానమే అన్నది ఉమ్మడి కృష్ణాలోని టీడీపీ నాయకులకు తెలియని అంశమేమీ కాదు. నియోజకవర్గం పరిధిలో సీనియర్‌ నాయకులు ఎందరున్నా వారిని పక్కనపెట్టి విజయవాడ ఎంపీ కేశినేనికి రెండేళ్ల కిందట కో ఆర్డినేటర్‌ బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌మీరా, రాష్ట్ర మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ ఫతావుల్లా, వాణిజ్య విభాగ రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్‌ తదితరులు ఉన్నారు. బుద్దా వెంకన్న ఎమ్మెల్సీగానే కాకుండా నగర పార్టీ అధ్యక్షుడిగా, ప్రభుత్వ విప్‌గా, రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా పని చేశారు.

నాగుల్‌మీరా గతంలో పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జిగా, నూర్‌బాషా సంఘం రాష్ట్ర నాయకుడిగా ఉన్నారు. నియోజకవర్గంపై పార్టీ దృష్టి ఏమాత్రం ఉన్నా ఇందరు నాయకుల్లో ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగించి పార్టీని గాడిలో పెట్టి ఉండవచ్చు. తక్షణ అవసరంగా ఎంపీకి పశ్చిమ కో ఆర్డినేటర్‌ బాధ్యతలను అప్పగించినా రెండేళ్లుగా అలాగే కొనసాగించాల్సిన అవసరం ఏంటనేది స్వపక్షీయుల ప్రశ్న. ఎంపీకి నేతృత్వం అప్పగించినా తమందరినీ పక్కనపెట్టి ఏ పదవీలేని ఎం.ఎస్‌. బేగ్‌కు అంత ప్రాధాన్యం ఎలా ఇస్తారనేది ప్రధాన వాదన. యువగళం ముగింపు సభలో మైనార్టీల తరఫున ప్రసంగించే అవకాశాన్ని బేగ్‌కు ఇవ్వడంపైనా రగడ జరిగిన సంగతి తెలిసిందే. పశ్చిమ నేతల మధ్య రగడకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అధిష్టానిదేనని, తగువు పెట్టాం తన్నుకు చావండని ప్రోత్సహిస్తోందని పార్టీ సీనియర్ల విశ్లేషణ.

ఒంటరిగా ఎన్నికలకు వెళ్లలేమనే..
ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి గెలవలేమని, ఎన్ని పార్టీలతోనైనా సీట్ల బేరసారాల ఒప్పందాలు కుదుర్చుకుంటామనే అంచనాలతోనే పశ్చిమ నియోజకవర్గం ఆప్షన్‌ను అలాగే ఉంచుకున్నట్లు స్పష్టమవుతోంది. రానున్న ఎన్నికల్లో కుదిరే ఒప్పందాల ఆధారంగా జనసేన/సీపీఐ/బీజేపీ.. కేటాయించే అవకాశాలు లేకపోలేదని సీనియర్లు ముక్తాయిస్తున్నారు.

గాడిలో పెట్టే యోచన ఏది..?
నియోజకవర్గంలో పార్టీని పటిష్ట పరచాలన్నా, గాడిన పెట్టాలన్నా అధిష్టానం దృష్టి సారిస్తుంది. ఇది ఏ పార్టీకై నా సాధారణం, అవసరం కూడా. నిత్యం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని, వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిని, జిల్లా పార్టీ అధ్యక్షుడు, కో ఆర్డినేటర్‌కు వ్యతిరేకంగా వ్యవహరించేవారి పట్ల చర్యలు తీసుకోవాలి. అలా వీలుకాని పక్షంలో కో ఆర్డినేటర్‌ను మార్చుకుని చక్కదిద్దగలిగే వారికి బాధ్యతలు అప్పగించడం పరిపాటి. అలాంటివేమీ చేయడం లేదంటే పశ్చిమ నియోజకవర్గంను అధిష్టానం ఆరోవేలుగా పరిగణిస్తున్నట్లుగా అర్థం చేసుకోవాలని పరిశీలకుల అభిప్రాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement