శవ మాఫియా!
మానవత్వానికి మాయని మచ్చ బందరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మృతదేహాలతో వ్యాపారం! ఒక్కొక్క అనాథ శవానికి రూ.70 వేల నుంచి రూ.లక్ష వసూలు మాఫియాతో చేతులు కలిపిన ఆస్పత్రిలోని కొందరు ఉద్యోగులు!
మాఫియాతో ఉద్యోగుల సంబంధాలు
అలాంటి అవకాశమే లేదు
మరణం తర్వాత కూడా మనిషికి గౌరవం దక్కాలి. అయితే సమాజ విలువలను తుంగలోకి తొక్కి బందరు సర్వజన ఆస్పత్రిలో మృతదేహాలను సరుకులుగా మార్చి కొందరు వ్యాపారం చేస్తున్నారు. వీరితో ఆస్పత్రిలోని కొంతమంది సిబ్బంది చేతులు కలపడంతో ఈ దందా కొనసాగుతోంది. ఎవరి ఆశీస్సులతో అమానుష వ్యాపారం కొనసాగుతోందో తెలియాల్సి ఉంది.
మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ‘శవ’ మాఫియా రాజ్యమేలుతోంది. డెడ్ బాడీలతో డీల్ కుదుర్చుకుని వ్యాపారం చేస్తున్నారు. ఈ శక్తులతో ఆస్పత్రిలో కొందరు ఉద్యోగులు చేతులు కలపడంతో వీరి పని సులువవుతోంది. ఒక్కొక్క అనాథ మృతదేహానికి ధర నిర్ణయించి రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు దండుకుంటోంది. మార్చురీలోని అనాథ శవాలను మాయం చేసి ఎవరికీ అనుమానం రాకుండా కొంతకాలంగా సుమారు 34 మృతదేహాలను విక్రయించినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం పలు విమర్శలకు తావిస్తోంది.
ఎక్కువగా ఫార్మాలిన్ వాడకం
అనాథ శవాలు ఎక్కువ కాలం చెడిపోకుండా ఉంచడానికి ఫార్మాలిన్‌ను వినియోగిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రి నిధులతోనే కొనుగోలు చేసిన 340 లీటర్ల ఫార్మాలిన్‌ను ఈ అనాథ మృతదేహాలను సంరక్షించేందుకు వినియోగించారని ఆరోపణలు వినవస్తున్నాయి.
గతంలో ఇలా..
సర్వజన ఆస్పత్రి జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిగా ఉన్న సమయంలో అనాథ మృతదేహాలను ఐదు రోజులపాటు భద్రపరిచేవారు. ఆ శవం సంబంధిత వ్యక్తులు ఎవరూ రాకపోతే మునిసిపల్ సిబ్బందికి అప్పగించి అంత్యక్రియలు నిర్వహించేవారు. అయితే మెడికల్ కళాశాలకు అనుబంధంగా మారిన తర్వాత ఈ విధానం పూర్తిగా మారిపోయింది.
వివరణ కోరిన ఉన్నతాధికారి
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మృతదేహాల వ్యాపారంపై వస్తున్న ఆరోపణలపై కలెక్టర్ సంబంధిత అధికారులను వివరణ కోరారు. ఈ విషయంపై డీఎంహెచ్‌ఓ, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. అయితే అధికారుల నుంచి స్పష్టమైన వివరణ అందలేదని సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో దీనిపై దృష్టి సారించాల్సి ఉంది.
సర్వజన ఆస్పత్రిలోని అనాథ మృతదేహాలను ప్రభుత్వ మెడికల్ కళాశాలకు, గుర్తింపు పొందిన మెడికల్ కళాశాలలకు పంపడంగానీ లేకపోతే అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. ఈ నిర్ణయాలను సూపరింటెండెంట్‌తో పాటు నలుగురు డెప్యూటీ సూపరింటెండెంట్లు తీసుకుంటారు. ఇక్కడే మాఫియాతో చేతులు కలిపిన ఆస్పత్రి ఉద్యోగులు వీరి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వీరు మృతదేహానికి సంబంధించిన వారి వివరాలను సేకరిస్తుంటారు. అది అనాథ మృత దేహమని నిర్ధారించుకుంటారు. అనంతరం తగిన ఆధారాలు, ఓ కల్పిత కుటుంబాన్ని సృష్టిస్తారు. సదరు కల్పిత కుటుంబం ఈ మృతదేహం తమ బంధువుదేనని ఆస్పత్రి వర్గాలను నమ్మించి తీసుకుంటారు. ఈ కుటుంబానికి కొంత నగదు ముట్టజెప్పి మృతదేహాన్ని కొందరు ఉద్యోగులు మాఫియాకు అప్పగిస్తుంటారని తెలుస్తోంది. వారం రోజుల క్రితం ఇదే తరహా ఘటన వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ ప్రక్రియలో ఆస్పత్రి సిబ్బందికి కొందరు వైద్యాధికారులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.


