అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు
పెళ్లి కుమారుడిగా వేణుగోపాలుడు
కోడూరు: హంసలదీవి రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, విశేషస్నపన, ఉత్సవ మూర్తులకు అభిషేకాలను భక్తిప్రపత్తులతో చేశారు. వేణుగోపాలుడిని పెళ్లికుమారుడిగా, రుక్మిణీ, సత్యభామ అమ్మవార్లను పెళ్లికుమార్తెలుగా అలంకరించారు. శృంగేరీ పీఠం దత్తత దేవాలయం కావడంతో పీఠం తరఫున ధర్మాధికారి కుప్పా సుబ్రహ్మణ్య అవధాని దంపతులు స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించి కల్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టారు. యాజ్ఞిక బ్రహ్మ దివి హరికృష్ణ ఆధ్వర్యంలో అర్చకులు డి.వి.కుమార్, దీవి నందకుమార్, డి.ఎన్.దీక్షితులు, దీవి శ్రీనివాసాచార్యుల మంత్రవచనాల నడుమ సాయంత్రం విష్వక్సేన పూజ, పుణ్యావచనం, దీక్ష స్వీకరణ, ఆఖండ దీపారాధన, వాస్తుపూజ, వాస్తుహోమం, అంకుర్పారణ, ధ్వజారోహణ కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారి మూలవిరాట్‌కు పుష్పాభిషేకాన్ని కనులపండువగా చేశారు. శనివారం ఉదయం రాజ్యలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, రాత్రికి ఆరుబయట ఉన్న కల్యాణ వేదికలో స్వామివారి కల్యాణాన్ని నిర్వహించనున్నట్లు ధర్మాధికారి తెలిపారు.


