పెద్ద తిరునాళ్లకు సర్వం సిద్ధం
తిరుపతమ్మ కల్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారం
పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీతిరుపతమ్మ కల్యాణ మహోత్సవాల (పెద్ద తిరునాళ్ల) విజయవంతానికి ఆలయ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. కల్యాణం తిలకించడానికి వీఐపీ పాస్‌లు ఏర్పాటు చేయడంతో పాటు రూ.200 టికెట్లు సిద్ధంగా ఉంచుతున్నామని ఆలయ ఈఓ బి.మహేశ్వరరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు చుంచు రమేష్‌బాబు శుక్రవారం తెలిపారు. కల్యాణాన్ని హిందూ ధర్మం చానల్ ద్వారా ఆదివారం రాత్రి 8.30 గంటల నుంచి 10 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు పేర్కొన్నారు. కల్యాణం రోజు మునేరు అవతల కంఠంనేని గార్డెన్స్‌లో దీక్ష విరమించిన స్వాములకు, వారితో వచ్చిన 30 వేల మందికి పైగా భోజన ఏర్పాట్లు చేయనున్నామన్నారు. గ్రామంలోని పలు దేవాలయాల్లో స్వాములు సేద తీరడానికి టెంట్లు ఏర్పాటు చేశారు. భక్తులకు 1.80 లక్షల లడ్డూ ప్రసాదాలను సిద్ధంగా ఉంచుతున్నామని తెలిపారు. కల్యాణం పూర్తయిన తర్వాత అమ్మవారి తలంబ్రాలు భక్తులకు పంపిణీ చేస్తామని, ఆలయ అధికారులకు సహకరించాలన్నారు. ఐదు రోజుల పాటు ఆలయం వద్ద అంబులెన్స్, మెడికల్ క్యాంప్‌తో పాటు ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉంచుతామన్నారు.
వేడుకలకు భారీ ఏర్పాట్లు
అమ్మవారి ఉత్సవాలకు దేవదాయ, పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.1.30 కోట్ల అంచనాలతో భారీ కల్యాణ వేదిక, బారికేడ్లు, లైటింగ్, రహదారుల మరమ్మతులతో పాటు భక్తులకు అవసరమైన సౌకర్యాలపై అధికారులు దృష్టి పెట్టారు. 70 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో కల్యాణ వేదిక ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆలయ ఈఈ ఎల్. రమాదేవి తెలిపారు.


