తెలుగు నేర్పడమే వేటూరికి అర్పించే నివాళి
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ కృష్ణాజిల్లా పెదకళ్లేపల్లిలో వేటూరి సాహిత్య మహోత్సవం
పెదకళ్లేపల్లి (మోపిదేవి): తెలుగు రాయడం, చదవడం తప్పనిసరిగా నేర్పడమే వేటూరికి అర్పించే నివాళి అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ అన్నారు. కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలోని పెదకళ్లేపల్లిలో సుప్రసిద్ధ సినీ గీత రచయిత వేటూరి సుందర రామమూర్తి 90వ జయంతి అమెరికా వేటూరి సాహిత్య అభిమాన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ వేటూరి సినీయేతర సాహిత్య సంపుటాలను వారి స్వగ్రామంలో ఆవిష్కరించే అవకాశం కలగడం తన అదృష్టమన్నారు. అవసరం కోసం ఇంగ్లిష్ నేర్చుకున్నా మాతృభాష తప్పని సరిగా నేర్పాలని సూచించారు. అమెరికా వేటూరి సాహిత్య అభిమాన వేదిక చైర్మన్ తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ వేటూరి సినీయేతర సాహిత్యాన్ని వారి స్వగ్రామం పెదకళ్లేపల్లికి అంకితమివ్వడం తన అదృష్టమన్నారు. వేటూరి సాహిత్యాన్ని సంపుటాలుగా ముద్రించే క్రమంలో ఆయన కుమారుడు రవి ప్రకాశ్, శిష్యుడు ఓరుగంటి ధర్మతేజ అందించిన సహకారం మరువలేనిదన్నారు. రాష్ట్రంలో ప్రతి లైబ్రరీకి వేటూరి సాహిత్య సంపుటాలను అందజేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే మండలి బుద్ధ్దప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాషకు ప్రాచీన హోదా వేటూరి కృషితోనే సాధ్యమైందన్నారు. అనంతరం వేటూరి రచించిన సినీయేతర సాహిత్య గ్రంథాలకు గ్రామంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి దేవస్థానంలో పూజలు జరిపించారు. అనంతరం వేదికపై ఆవిష్కరించి, పెదకళ్లేపల్లి ప్రజలకు అంకితం చేశారు.


