సాక్షి, గుంటూరు: గుంటూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుంటూరులో టీడీపీ నేతలు రెచ్చిపోయి గూండాయిజానికి దిగారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడికి ప్రయత్నించారు. కర్రలు, రాడ్లతో అంబటిపై దాడి చేసేందుకు పచ్చ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో, అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
దాడికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కూటమి అపచారానికి వైఎస్సార్‌సీపీ పాప ప్రక్షాళన పూజలు తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అంబటి రాంబాబు.. గోరంట్లకు వెళ్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు, నేతలు ఆయన కారును అడ్డుకున్నారు. అనంతరం, రాడ్లు, కర్రలతో టీడీపీ నేతలు రాంబాబుపై దాడికి ప్రయత్నించారు. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ టీడీపీ నేతలు దాడియత్నం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై అంబటి.. ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ..‘చంద్రబాబు అరచకాలు సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా? లేదా?. టీడీపీ ఫ్లెక్సీలకు పోలీసులు కాపలా కాస్తున్నారు. ప్లాన్ ప్రకారమే నాపై దాడి యత్నం జరిగింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు కర్రలు, రాడ్లు పట్టుకుని తిరుగుతున్నా.. పోలీసులు ఏం చేస్తున్నారు’ అని ప్రశ్నించారు.
కాగా, తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై విచారణ జరిపిన సీబీఐ అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేసి దాడులకు ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం కూడా మాజీ మంత్రి విడదల రజినిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. పల్నాడు జిల్లాలోని బోయపాలెంలో టీడీపీ గూండాలు నానా హంగామా చేసి విడదల రజినీపై దాడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. తిరుమల లడ్డూపై టీడీపీ విష ప్రచారాన్ని నిరసిస్తూ విడదల రజినీ ఓ గుడిలో పూజలు చేశారు. అయితే విడదల రజినీ పూజలు చేస్తుండగా టీడీపీ గూండాలు.. గుడి బయట హల్‌చల్ సృష్టించారు. గుడి బయట నానా హంగామా చేసి.. పూజను అడ్డుకోవడానికి యత్నించారు. దీనిలో భాగంగానే విడదల రజినీ కారును సైతం అడ్డుకున్నారు టీడీపీ గూండాలు. కారును అడ్డుకుని విడదల రజినీపై దాడికి యత్నించారు. ఆమె కారును కూడా ధ్వంసం చేసేందుకు యత్నించగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి.



