హనుమాన్‌జంక్షన్ సమీపంలోని పెరికీడు వద్ద ఎంఎన్‌కే రోడ్డు
హనుమాన్‌జంక్షన్ రూరల్(మచిలీపట్నం): ప్రస్తుతం రాష్ట్ర రహదారిగా ఉన్న మచిలీపట్నం –నూజివీడు – కల్లూరు (ఎంఎన్‌కే) రోడ్డును 216హెచ్ జాతీయ రహదారిగా మార్చుతూ నాలుగు/ఆరు లైన్లతో విస్తరించేందుకు రంగం సిద్ధమైంది. కృష్ణాజిల్లా పెడన నుంచి ఎన్టీఆర్ జిల్లాలోని లక్ష్మీపురం వరకు రోడ్డు నిర్మాణం జరగనుంది. నాలుగు జాతీయ రహదారులను కలుపుతూ మూడు జిల్లాల మీదుగా 118 కిలోమీటర్లు మేర 216హెచ్ జాతీయ రహదారిని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) తయారీ, మట్టి నమునాల పరీక్షలు జరుగుతున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూ.1500 కోట్ల అంచానాలతో ఈ హైవేను విస్తరించనున్నారు.
నూతన హైవేకు ప్రాధాన్యం
మూడు జిల్లాల మీదుగా నాలుగు జాతీయ రహదారులను అనుసంధానం చేసే జాతీయ రహదారి 216హెచ్‌కు ఎంతో ప్రాధాన్యం ఏర్పడనుంది. కృష్ణాజిల్లాలోని పెడన, కవుతవరం, గుడ్లవల్లేరు, గుడివాడ, హనుమాన్‌జంక్షన్, ఏలూరు జిల్లాలోని మీర్జాపురం, నూజివీడు, అన్నవరం, ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్నపేట, పుట్రేల, మల్లెల, లక్ష్మీపురం వరకు ఈ రోడ్డును నిర్మిస్తారు. 216హెచ్ నాలుగు జాతీయ రహదారులను కలుపుతూ సాగుతుంది. జాతీయ రహదారి 216 (ఒంగోలు – కత్తిపూడి)పై పెడన వద్ద నిర్మించిన బైపాస్ నుంచి ప్రారంభమయ్యే 216హెచ్ హైవే గుడివాడ వద్ద ఎన్‌హెచ్–165, హనుమాన్‌జంక్షన్ వద్ద ఎన్‌హెచ్–16ను అనుసంధానం చేస్తూ లక్ష్మీపురం వద్ద ఎన్‌హెచ్–30లో కలుస్తుంది.
సిద్ధమైన డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్
నూతన జాతీయ రహదారి 216హెచ్ విస్తరణకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ద్వారా డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) రూపొందించేందుకు చైన్నెకు చెందిన గుడ్‌ల్యాండ్ సర్వే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టెండర్ దక్కించుకుంది. గతేడాది సెప్టెంబర్‌లో డీపీఆర్ తయారీని ప్రారంభించిన ఆ సంస్థ ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేసింది. హనుమాన్‌జంక్షన్ వద్ద రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి, శేరినరసన్నపాలెం వద్ద ఏలూరు–కృష్ణా కాలువ, మర్రిబంధం వద్ద పోలవరం కుడి ప్రధాన కాలువలపై వంతెనలు నిర్మించేందుకు మట్టి నమునా పరీక్షలను కూడా పూర్తి చేశారు. ఇవి కాకుండా దాదాపు 50కిపైగా చిన్న వంతెనలు, వెహికల్ అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. జనసాంధ్రత, వాహనాల రద్దీ దృష్ట్యా గుడ్లవల్లేరు, కవుతవరం, గుడివాడ, పుట్టగుంట, ఆరుగొలను, హనుమాన్‌జంక్షన్, మీర్జాపురం, విస్సన్నపేట, పుట్రేల వద్ద 216హెచ్ జాతీయ రహదారికి అనుసంధానంగా బైపాస్ రోడ్లు నిర్మించాలని డీపీఆర్‌లో ప్రతిపాదించారు.
మూడు ప్యాకేజీల్లో నూతన హైవే నిర్మాణం
పెడన నుంచి లక్ష్మీపురం వరకు 121 కిలో మీటర్ల మేర ఉన్న 216హెచ్ జాతీయ రహదారిని నాలుగు/ఆరు లైన్లుగా విస్తరించేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొత్తం మూడు ప్యాకేజీలుగా విభజించి రోడ్డు నిర్మాణం పూర్తిచేయనున్నారు. పెడన నుంచి గుడివాడ సమీపంలోని జనార్దనపురం వరకు 33.30 కిలోమీటర్ల వరకు మొదటి ప్యాకేజీగా, జనార్దనపురం నుంచి నూజివీడు సమీపంలోని అన్నవరం వరకు 45.11 కిలోమీటర్లు రోడ్డును రెండో ప్యాకేజీగా విభజించారు. అన్నవరం నుంచి తిరుపూరు సమీపంలోని లక్ష్మీపురం వరకు 42.44 కిలోమీటర్లు రోడ్డును మూడో ప్యాకేజీగా గుర్తించారు. ఈ జాతీయ రహదారిని 45 మీటర్ల నుంచి 60 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు.
216హెచ్ జాతీయ రహదారి విస్తరణకు రంగం సిద్ధం పెడన నుంచి లక్ష్మీపురం వరకు నాలుగు/ఆరు లైన్లతో నిర్మాణం నాలుగు హైవేలను అనుసంధానం చేయనున్న రహదారి మూడు జిల్లాల మీదుగా 118 కి.మీ. మేర విస్తరణ పలుచోట్ల బైపాస్ రోడ్ల నిర్మాణానికి అనుమతులు
రెండు నెలల్లో నోటిఫికేషన్
పెడన నుంచి లక్ష్మీపురం వరకు ఉన్న ఎంఎన్‌కే రోడ్డును జాతీయ రహదారి 216హెచ్‌గా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ రహదారిని అవసరమైన మేరకు నాలుగు, ఆరు లైన్లుగా విస్తరించి, అభివృద్ధి చేసేందుకు కూడా ఇప్పటికే చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. నాలుగు నెలలుగా రహదారి విస్తరణపై క్షేత్రస్థాయిలో సర్వే పనులు జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో భూసేకరణ నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది.
– బి.సాయి శ్రీనివాస్, ప్రాజెక్టు డైరెక్టర్, మచిలీపట్నం
హనుమాన్‌జంక్షన్ వద్ద మట్టి పరీక్షలు (ఫైల్)


