ఆసిఫాబాద్అర్బన్: ఎల్సీడీసీ కార్యక్రమం సేవలు, క్షేత్రస్థాయి అమలులో ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లు, ఉత్తమ పద్ధతులపై జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో బుధవారం వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఎల్సీడీసీ పర్యవేక్షణ అధికారి డా.నిర్మల క్షేత్రస్థాయి పరిస్థితులు, జిల్లాస్థాయిలో పురోగతి వివరాలను డీఎంహెచ్వో నాగేంద్రను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 22 నుంచి నవంబర్ 4 వరకు చేపట్టే కుష్ఠు వ్యాధి ఇంటింటీ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇళ్లకు వచ్చే వైద్యసిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రోగ్రాం అధికారి సుజిత్, సిబ్బంది పాల్గొన్నారు.


