ఆసిఫాబాద్‌రూరల్: ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేసే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. దీంతో 2026– 27 విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రవేశాలు పాత పద్ధతిలోనే ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 49 జూనియర్ కళాశాలు ఉన్నాయి. ఇందులో 13 కస్తూ రిబా గాంధీ విద్యాలయాలు, ఐదు సాంఘిక సంక్షేమ గురుకులాలు, గిరిజన సాంఘిక సంక్షేమ గురుకులం, మూడు మైనార్టీ గురుకులాలు, నాలుగు మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాలు, రెండు మోడల్ స్కూళ్లలో పాఠశాల విద్యతోపాటు ఇంటర్ వరకు తరగతులు కొనసాగుతున్నాయి. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 11 ఉండగా, ప్రైవేట్ కాలేజీలు ఐదు ఉన్నాయి. మొత్తం 49 కాలేజీల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీతోపాటు ఒకేషనల్ గ్రూపుల్లో సుమారు 8 వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ విద్యా సంవత్సరం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంది. గతేడాది జిల్లాలోని 11 ప్రభుత్వ కళాశాలల్లో ఫస్టియర్‌లో 2,577 మంది, సెకండియర్‌లో 2,048 మంది విద్యనభ్యసించారు.
విలీనం చేయాలని భావించినా..
ఇంటర్మీడియట్‌ను రద్దు సీబీఎస్‌ఈలో తరహాలో 11, 12 తరగతులను కూడా పాఠశాలల విద్యలోనే కొనసాగించాలని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. తర్వాత గణనీయంగా డ్రాపౌట్స్ తగ్గించవచ్చని సూచించింది. అయితే ప్రవేశాలకు తక్కువ సమయం ఉండటం, పాఠశాల విద్యలో విలీనం చేసేందుకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండటంతో విద్యార్థుల ప్రయోజనాలను భంగం వాటిల్లకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో యథావిధిగా పాత పద్ధతిలోనే అడ్మిషన్లు చేపడుతున్నారు.
ప్రైవేట్‌లో అడ్మిషన్ల జోరు..!
ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు ఇప్పటికే అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. ప్రైవేట్ స్కూళ్లలో పదో తరగతి చదివిన విద్యార్థుల సమాచారం, ఫోన్ నంబర్లు తీసుకుని కాంటాక్ట్ అవుతున్నారు. కాలేజీల ప్రారంభానికి ముందుగా అడ్మిషన్లు తీసుకుంటే రూ.10వేల నుంచి రూ.20వేల వరకు ఫీజు తగ్గిస్తామని ప్రలోభపెడుతున్నారు. ఇంటర్‌తోపాటు నీట్, ఎంసెట్, జేఈఈ వంటి పోటీ పరీక్షల్లో రాణించేలా సిద్ధం చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు. జిల్లాకు చెందిన కళాశాలల యాజమాన్యాలతోపాటు మంచిర్యాల, కరీంనగర్‌కు చెందిన కాలేజీల యాజమాన్యాలు కూడా ప్రచారం ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. అడ్వాన్స్‌గా రూ.5వేలు తీసుకుని విద్యార్థుల ఆధార్ నంబర్, పేర్లు నమోదు చేసుకుంటున్నారు.
ప్రభుత్వ కాలేజీల్లో మెరుగైన విద్య
పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకోవాలి. ప్రభుత్వ కళాశాలలో మౌలిక వసతులతో కూడిన విద్యతోపాటు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నాం. ఇక్కడే మెరుగైన విద్య అందుతుంది. ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులను ప్రలోభా లకు గురిచేస్తే చర్యలు తీసుకుంటాం. మొదటి విడత ప్రవేశాలకు ఈ నెల 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. – రాందాస్, డీఐఈవో


