మూడోరోజూ.. అదే తీరు | - | Sakshi
Sakshi News home page

మూడోరోజూ.. అదే తీరు

Apr 25 2026 8:06 AM | Updated on Apr 25 2026 8:06 AM

● విధులకు దూరంగా ఆర్టీసీ కార్మికులు

ఆసిఫాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. మూడోరోజూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని డిపో నుంచి పాక్షికంగా బస్సులు నడిచాయి. ఔట్‌సోర్సింగ్‌, ప్రైవేట్‌ డ్రైవర్లతో నాలుగు రూట్లలో 46 బస్సులు నడపగా, ఇందులో 20 ఆర్టీసీ సర్వీసులు, 26 ప్రైవేటు అద్దె బస్సులు ఉన్నాయి. కండక్టర్లు లేకపోవడంతో మహిళలు, పురుషులు అందరికీ ఉచిత ప్రయాణం కల్పించారు. ప్రయాణికుల రద్దీతో బ స్సులు కిక్కిరిసిపోయాయి. సమ్మెతో ఆసిఫాబాద్‌ డిపోకు సుమారు రూ.48 లక్షలు వాటిల్లింది. బస్టాండ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన టెంట్‌ను పోలీసులు తొలగించారు. ఎస్పీ నితిక పంత్‌ డిపో ను సందర్శించి కార్మికులను ఉద్దేశించి మాట్లాడా రు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ప్రభుత్వం సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఎండలతో నీడ లేక ఇబ్బందవుతుందని, బస్టాండ్‌ సమీపంలో టెంట్‌ వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కార్మికులు ఎస్పీని కోరారు.

శంకర్‌గౌడ్‌కు నివాళి

ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్ప డిన వరంగల్‌ జిల్లాకు చెందిన ఆర్టీసీ కార్మికుడు శంకర్‌గౌడ్‌కు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్‌ చౌక్‌ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో శాంతి ర్యాలీ చేపట్టారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగె ఉపేందర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కార్మికులు ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరమన్నారు. కార్మికుడి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. శంకర్‌గౌడ్‌ మరణమే చివరి మరణం కావాలన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఇరుకుల మంగ, సంఘం జిల్లా అధ్యక్షుడు టి.దివాకర్‌, ఉపాధ్యక్షుడు చిరంజీవి, ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ అశోక్‌, మంజుల, కవిత, ప్రవీణ్‌, లక్ష్మణ్‌, ఎజాజ్‌, దేవి, కుమార్‌, ఆర్‌పీ సింగ్‌, కార్మికులు పాల్గొన్నారు.

బీజేపీ నాయకుల సంఘీభావం

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు కొయ్యల హేమాజీ, జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, నాయకులు తిరుపతి, కేశవరెడ్డి, గోవర్ధన్‌, ఖాండ్రే విశాల్‌తో కలిసి బస్టాండ్‌ వద్ద కార్మికులను కలిసి మద్దతు తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హేమాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో నే శంకర్‌గౌడ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయమైన హక్కుల కోసం కా ర్మికులు ధైర్యంగా పోరాడాలని, ఆత్మహత్యలకు పా ల్పడవద్దని సూచించారు. కార్మికులకు తమ పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.

కార్మికులతో మాట్లాడుతున్న ఎస్పీ నితిక పంత్‌

ర్యాలీ నిర్వహిస్తున్న కార్మికులు, బీజేపీ నేతలు

Advertisement
 
Advertisement
Advertisement