లక్ష్యం.. శతశాతం
ఈ నెల 17 నుంచి 24 వరకు పదో తరగతి ప్రీఫైనల్ కొనసాగుతున్న వారంతపు పరీక్షలు పకడ్బందీగా యాక్షన్ ప్లాన్ 2.0 అమలు
కెరమెరి: విద్యార్థుల భవిష్యత్తుకు పదో తరగతి పరీక్షలే కీలకం. ఈ విద్యాసంవత్సరంలో శతశాతం ఉత్తీర్ణతకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పక్కాగా అమలు చేస్తున్నారు. ఈ నెల 17 నుంచి 24 వరకు ప్రీఫైనల్ పరీక్షలు ప్రారంభం కానుండగా, ఈ నెల 1 నుంచి వారంతపు పరీక్షలు మొదలయ్యాయి. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు కొనసాగే పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు.
యాక్షన్ ప్లాన్ అమలు
జిల్లాలో 60 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 15 కేజీబీవీలు, రెండు మోడల్ స్కూళ్లు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 3,026 మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. జిల్లాలో ‘శతం శాతం సాధన యాక్షన్ ప్లాన్ 2.0’ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దీని కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠ్యాంశాలపై పూర్తిగా అవగాహన కలిగేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతున్నారు. పరీక్షల్లో ప్రశ్నలు ఏ విధంగా ఇచ్చినా అర్థం చేసుకుని రాసేలా సన్నద్ధం చేస్తున్నారు. మూడేళ్లుగా జిల్లా పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో చివరి నుంచి మూడో స్థానంలో నిలుస్తోంది. ఈసారి మెరుగైన ఫలితాలు సాధించి మొదటి నుంచి పదిలోపు స్థానం సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారు.
ప్రత్యేక శ్రద్ధ.. ప్రణాళికలు అమలు
విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు చదువులో వెనుకబడిన పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులు దత్తత తీసుకున్నారు. ఇంగ్లిష్, గణితం, సైన్స్ పాఠ్యాంశాల్లో రాణించేలా సంసిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మూడు సబ్జెక్టుల వారంతపు టెస్టులు ముగిశాయి. ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు.
ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధనకు ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ విద్యాసంవత్సరంలో మెరుగైన ఫలితాల సాధనకు గత నెల నుంచి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నాం. శతశాతం సాధన యాక్షన్ ప్లాన్ 2.0 తో ముందుకెళ్తున్నాం.
– ఉప్పులేటి శ్రీనివాస్,
విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్


