కౌంటింగ్‌కు రెడీ!
నేడు మున్సిపల్ తుది తీర్పు ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి ఉదయం 8 గంటలకు ప్రక్రియ ప్రారంభం తేలనున్న 224 మంది భవితవ్యం చైర్‌పర్సన్ పదవిపై ప్రధాన పార్టీల దృష్టి
ఆసిఫాబాద్: మున్సిపల్ కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కాగజ్‌నగర్‌లోని బాలవిద్యామందిర్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు విజేతలెవరో తేలే అవకాశం ఉంది. రెండు మున్సిపాలిటీల్లోని 50 వార్డుల్లో 65,132 మంది ఓటర్లు ఉండగా 43,754 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆసిఫాబాద్‌లో 13,927 మంది ఓటర్లకు 10,817 మంది, కాగజ్‌నగర్‌లో 51,205 మందికి 32,937 మంది ఓటేశారు. బ్యాలెట్ బాక్స్‌లు స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచారు. రెండు మున్సిపాలిటీల్లో బరిలో నిలిచిన 224 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ప్రశాంత వాతావణంలో ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు చేపట్టింది.
లెక్కింపు ఇలా..
కౌంటింగ్ ప్రక్రియకు విధులు కేటాయించిన అధికా రులు, సిబ్బంది ఉదయం 6.30 గంటలకే కౌంటింగ్ హాల్స్‌కు కేంద్రాలకు చేరుకోనున్నారు. ఆసిఫా బాద్‌లో ఒక్కో హాల్‌లో ఐదు టేబుళ్లు ఏర్పాటు చేయగా, ఒక్కో రౌండ్‌కు 10 వార్డుల చొప్పున రెండు రౌండ్లలో 20 వార్డులు లెక్కింపు పూర్తి చేయనున్నారు. కాగజ్‌నగర్‌లోని 30 వార్డుల లెక్కింపును సైతం రెండు రౌండ్లలో పూర్తి చేయనున్నారు. అభ్యర్థులు సమక్షంలో ఉదయం 8 గంటలకు బ్యాలెట్ బాక్స్‌లు తెరిచి కౌంటింగ్ ప్రారంభించనున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లను లెక్కిస్తారు. ప్రతీ టేబుల్ వద్ద అభ్యర్థి, వారి తరఫున ఏజెంట్లు ఉంటారు. ప్రతీ బ్యాలెట్ పేపర్ క్షుణ్ణంగా ఏజెంట్ల సమక్షంలో పరిశీలిస్తారు. ప్రతీ టేబుల్‌కు ఆర్వో, ఒక సూపర్‌వైజర్, ఇద్దరు సహాయకులు ఉంటారు. 1000 ఓట్లకు ఒక రౌండ్ చొప్పున 100 చొప్పున బ్యాలెట్ పేపర్లను కట్టలు కడతారు. ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించరు. కలెక్టర్ కె.హరిత, ఉన్నతాధికారులు వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రక్రియను పర్యవేక్షిస్తారు.
క్యాంపు రాజకీయాలు షురూ..
ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో పోటీ నువ్వానేనా అన్న చందంగా మారింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉండగా, కొన్ని వార్డుల్లో స్వతంత్రులు, ఇతర పార్టీల అభ్యర్థులు చెప్పుకోదగ్గ ప్రభావం చూపనున్నారు. ఈ నెల 16న చైర్‌పర్సన్ ఎన్నిక ఉంది. చైర్మన్ ఎన్నికకు అవసరమైన స్పష్టమైన మెజార్టీ రాని పక్షంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. గెలుపుపై అభ్యర్థులు ఎవరికి వారే ధీమాతో ఉన్నా మెజార్టీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హంగ్ వచ్చే అవకాశం ఉన్నట్లు అన్ని పార్టీలు అంచనా వేస్తున్నాయి. గెలుపు గుర్రాలకు గాలం వేసేందుకు వారిని ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. ఇప్పటికే జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ తమ పార్టీ అభ్యర్థులు 18 మందిని రహస్య ప్రదేశానికి తరలించింది. కాంగ్రెస్ ముఖ్య నేతలు గురువారం తమ అభ్యర్థులతో జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఫలితాల అనంతరం తమ అభ్యర్థులను తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ సైతం తమ అభ్యర్థులు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది.
లెక్కింపునకు సర్వం సిద్ధం : కలెక్టర్ కె.హరిత
ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశామని కలెక్టర్ కె.హరిత తెలిపారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలోని 20 వార్డుల ఓట్ల లెక్కింపు రెండు రౌండ్లు, కాగజ్‌నగర్‌లోని 30 వార్డుల లెక్కింపును రెండు రౌండ్లలో పూర్తిచేస్తామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం కౌంటింగ్ ప్రక్రియ చేపడుతున్నామని పేర్కొన్నారు.
కౌంటింగ్‌కు రెడీ!


