ఓట్ల లెక్కింపునకు పటిష్ట బందోబస్తు
ఆసిఫాబాద్‌రూరల్: మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని గురువారం సందర్శించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా మూడంచెల భద్రత వ్యవస్థను అమలు చేయనున్నట్లు తెలిపారు. శాంతిభద్రత పరిరక్షణ పోలీసు సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదన్నారు. సంబంధిత అధికారులు నిర్దేశించిన తేదీల్లో మాత్రమే విజేతలు ఊరేగింపులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, సీఐలు బాలజీ వరప్రసాద్, ప్రేంకుమార్ తదితరులు పాల్గొన్నారు.


