
కౌటాలలో పులిదాడిలో మృతి చెందిన ఎద్దును పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు (ఫైల్)
నేరుగా ఖాతాల్లోకే పరిహారం నగదు
వన్యప్రాణుల దాడులతో నష్టపోయిన రైతులకు వేగంగా సాయం
గతంలో చెక్కుల రూపంలో అందజేత
కౌటాల(సిర్పూర్): పశువులపై వన్యప్రాణుల దాడులు పెరిగిన నేపథ్యంలో బాధిత రైతులకు సాయం వేగంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో పరిహారం చెక్కుల రూపంలో అందించగా, ఇక నుంచి పశుపోషకుల ఖాతాల్లోనే నేరుగా నగదు జమ చేయనుంది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అనేక గ్రామాలు దట్టమైన అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్నాయి. అక్కడి ప్రజలు వన్యప్రాణులతోనే సహవాసం చేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా–అంధారీ అభయారణ్యాల నుంచి పెన్‌గంగ, ప్రాణహిత నదులు దాటి పెద్దపులులు కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోకి ప్రవేశిస్తున్నాయి. పెద్దపులులు, అడవి పందులు, ఎలుగుబంట్లు రైతులపై దాడులు చేస్తున్నాయి. వన్యప్రాణుల దాడుల్లో పశువులు, మేకలు కూడా మృత్యువాత పడుతున్నాయి.
వన్యప్రాణులకు ఆవాసం..
జిల్లాలో 1,78,939.73 హెక్టార్లలో అటవీప్రాంతం విస్తరించి ఉండగా, 1100 గ్రామాలు అడవుల మధ్యే ఉన్నాయి. బెజ్జూర్, చింతలమానెపల్లి, పెంచికల్‌పేట్, కౌటాల, దహెగాం, కాగజ్‌నగర్, సిర్పూర్(టి), తిర్యాణి, కెరమెరి, సిర్పూర్(యూ), లింగాపూర్ ప్రాంతాల్లో అన్నిరకాల వన్యప్రాణులు జీవనం సాగిస్తున్నాయి. ప్రాణహిత, వార్దా నదులతోపాటు పెద్దవాగు పరీవాహక ప్రాంతాలను జింకలు, మెకాలు, దుప్పులు, కుందెలు, ఎలుగుబంట్లు, అడవి పందులు, సాంబార్లతోపాటు అనేక రకాల పక్షులు ఆవాసంగా మార్చుకున్నాయి.
పెరిగిన దాడులు
మహారాష్ట్ర నుంచి ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, మంచిర్యాల వరకు పులుల సంచారం ఉంటోంది. పెన్‌గంగ, వార్దా, ప్రాణహిత నదుల తీరాలు దాటి తిప్పేశ్వర్, తడోబా టైగర్ రిజర్వ్ పులుల అభయారణ్యాల నుంచి వలస వస్తుంటాయి. పదేళ్ల క్రితం పాల్గుణ అనే ఆడ పులి కాగజ్‌నగర్‌లోనే స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవడంతో ప్రస్తుతం వాటి సంతతి పెరిగింది. బఫర్ ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్న పులులు రైతులు, పశువులపై దాడులకు దిగుతున్నాయి. అటవీ ప్రాంతంలో నీటివనరులు తగ్గినప్పుడు ఇతర వన్యప్రాణులు కూడా గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. పశువులతో పాటు కాపరులపై కూడా అటవీ ప్రాంతంలో దాడి చేస్తున్నాయి. మనుషులు, వన్యప్రాణుల మధ్య ఘర్షణ వాతావరణం పెరిగింది. దీంతో జిల్లాలో పెద్దపులులను కొందరు హతమార్చారు. పంటలు కాపాడుకునేందుకు రైతులు విద్యుత్ తీగలు అమర్చడంతో విష ప్రయోగం చేస్తున్నారు. ఈ చర్యలను తగ్గించేందుకు ప్రభుత్వం వన్యప్రాణుల దాడుల్లో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు బాధితులకు వేగంగా పరిహారం అందిస్తుంది.
దరఖాస్తు చేస్తే వెంటనే..
వన్యప్రాణులను వేటాడితే చట్టపరమైన చర్యలు తప్పవు. పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల దాడిలో పశువులు మృత్యువాత పడితే రైతులు నష్టపోకుండా ప్రభుత్వం పరిహారం పెంచింది. దీనిపై జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. పశువులు మృతి చెందితే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చిన వెంటనే విచారణ చేసి రూ.5వేలు తక్షణ సాయం అందిస్తాం. పరిహారం కోసం దరఖాస్తు చేసిన వారికి జాప్యం లేకుండా నేరుగా పశుపోషకుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తాం.
– సుశాంత్ బొగాడే, ఎఫ్‌డీవో, కాగజ్‌నగర్
ఖాతాల్లోకి పరిహారం..
వన్యప్రాణుల బారినపడి మృత్యువాత పడిన పశువుల యజమానులకు పరిహారం చెల్లించే ప్రక్రియను అటవీ శాఖ వేగవంతం చేసింది. ఇకపై నేరుగా పోషకుల బ్యాంకు ఖాతాల్లోనే పరిహారం జమ చేస్తుంది. గతంలో బాధితులకు పరిహారాన్ని చెక్కుల రూపంలో ఇచ్చేవారు. దానికి రెండు వారాల సమయం పడుతుండగా ప్రస్తుత విధానంతో వారం రోజుల్లోనే నగదు అందుతుంది. రైతుల సమయం ఆదా కావడంతోపాటు అవినీతికి ఆస్కారం ఉండదని అధికారులు భావిస్తున్నారు. ముందుగా వన్యప్రాణులు పశువును చంపిన విషయాన్ని బాధితులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలి. వారు ఘటనాస్థలికి వెళ్లి పంచనామా నిర్వహించి నివేదిక రూపొందిస్తారు. అలాగే రైతు వివరాలు, పశువైద్యుడి ధ్రువపత్రం, బ్యాంకు ఖాతా, తదితర సమాచారాన్ని మీ సేవ కేంద్రం ద్వారా నమోదు చేయించాలి. జిల్లా అధికారులు పరిశీలించి ఆమోదం తెలిపిన వెంటనే డబ్బులు యజమాని ఖాతాలో జమవుతాయి. జిల్లాలో గత రెండేళ్లలో 114 పశువులు వన్యప్రాణుల దాడుల్లో మృతి చెందాయి. అటవీశాఖ బాధితులకు రూ.50,35,434 పరిహారం అందించింది. వన్యప్రాణుల దాడుల్లో రెండేళ్లలో ముగ్గురు మృతి చెందగా బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున అందజేశారు. వన్యప్రాణుల దాడుల్లో ఎలాంటి నష్టం జరిగినా ఫిర్యాదు చేయాలని అటవీశాఖ అధికారులు కోరుతున్నారు.
పరిహారం ఇలా..
వ్యక్తి మృతి చెందితే రూ. 10 లక్షలు
తీవ్ర గాయాలైతే రూ. లక్ష వరకు..
పంటలకు నష్టం జరిగితే రూ.7,500 వరకు..
పశువులు చనిపోతే రూ.50 వేల వరకు..
పశువులు గాయపడితే పరిహారం ఉండదు.