
పాన్ ఇండియా సంస్థగా సింగరేణి
రామకృష్ణాపూర్: సింగరేణి సంస్థకు కొత్త బొగ్గు గనులు కేటాయించకుంటే సంస్థ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని సంస్థ సీఅండ్‌ఎండీ బలరాంనాయక్ అన్నారు. అభివృద్ధి పథంలో పయనిస్తున్న సింగరేణి ప్రస్తుతం పాన్ ఇండియా సంస్థగా మారిందని తెలిపారు. సింగరేణి 55వ రక్షణ పక్షోత్సవాల బ హుమతి ప్రదానోత్సవం కార్యక్రమం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలోని ఎంఎన్‌ఆర్ గార్డెన్స్‌లో ఆది వారం నిర్వహించారు. కార్యక్రమానికి డీజీఎంఎస్ ఉజ్వల్‌థాతో కలిసి సీఎండీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బలరాంనాయక్ మాట్లాడుతూ తెలంగాణాతోపాటు ఒడిశా, రాజస్తాన్ తది తర రాష్ట్రాలకు సింగరేణి విస్తరించిందని తెలిపారు. విదేశాల్లోనూ సంస్థ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంస్థ స మగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటూనే గని కార్మి కుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సింగరేణి కార్మికులకు దసరా అడ్వాన్స్, దీపావళి బోనస్ సకాలంలో అందేలా చూస్తామన్నారు. ఉత్పత్తి కన్నా సంస్థకు కార్మికుల ప్రాణాలు ముఖ్యమని తెలిపారు. రక్షణ విషయంలో రాజీపడకుండా ఉండాలని సూచించారు. కొన్ని కారణాలతో బొగ్గు గనుల వేలంలో ఇప్పటివరకు పాల్గొనలేకపోయామని, ఇకపై వేలంలో పాల్గొంటామని చెప్పారు.
ప్రమాద రహిత సంస్థగా తీర్చిదిద్దాలి..
సింగరేణిని పూర్తిగా ప్రమాదరహిత సంస్థగా తీర్చి దిద్దాలని డైరెక్టర్ జనరల్ మైన్స్ సేఫ్టీ ఉజ్వల్ థా అన్నారు. సేఫ్టీ విషయంలో నూతన సాంకేతికత అందిపుచ్చుకోవాలన్నారు. మైనింగ్ రంగంలోకి మ హిళా ఉద్యోగులు రావడం శుభసూచకమని పేర్కొన్నారు. ఎక్కువ శాతం ప్రమాదాలు పనిలో అప్రమత్తంగా లేని కారణంగానే జరుగుతున్నాయన్నారు. ప్రమాదాలు జరుగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.
రక్షణ త్రైపాక్షిక సమావేశం..
సింగరేణిస్థాయి 49వ రక్షణ త్రైపాక్షిక సమావేశం ఆదివారం ఉదయం నిర్వహించారు. ఇందులో సింగరేణిలోని అన్ని ఏరియాల జీఎంలు, డైరెక్టర్లు, సేప్టీ అధికారులు పాల్గొన్నారు. రక్షణ విషయంలో రాజీ పడొద్దని డీజీఎంఎస్ సూచించారు. మరోవైపు మారుపేర్లు క్రమబద్ధీకరించాలని ఎంఎన్‌ఆర్ గార్డెన్ వద్ద బాధితులు నిరసన తెలిపారు. సీఎండీ బలరాంనాయక్ స్పందిస్తూ ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ సేప్టీ కన్నణ్, సింగరేణి డైరెక్టర్లు సత్యనారాయణ, సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, గౌతం, గుర్తింపు సంఘం అధ్యక్షుడు సీతారా మయ్య, ఐఎన్‌టీయూసీ సెక్రెటరీ జనరల్ జనక్‌ప్రసాద్, జీఎం సేఫ్టీ కార్పొరేట్ చింతల శ్రీనివాస్, సీఎంవోఏఐ అధ్యక్షుడు లక్ష్మీపతిగౌడ్, శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.