
సమృద్ధిగా వాన
ఆగస్టులో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు నిండుకుండలా మారిన ప్రాజెక్టులు, చెరువులు ఏడు మండలాల్లో అధిక వర్షపాతం
(టీఎంసీలు) (టీఎంసీలు) (క్యూసెక్కులు) (క్యూసెక్కులు)
దహెగాం(సిర్పూర్): జిల్లావ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. వర్షాకాలం సీజన్ ఆరంభంలో వరుణుడు జాడ లేక సాగుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. జూన్‌లో సరైన వర్షాలు కురువలేదు. ఇక జూలైలో మోస్తరు వానలే పడటంతో సాగు పనులకు ఆటంకం కలిగింది. ఆగస్టులో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడటంతో చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. జూన్ నుంచి సెప్టెంబరు 1 వరకు జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఏడు మండలాల్లో అధిక వర్షపాతం నమోదైందని అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 859.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,016.5 మిలీమీటర్లుగా నమోదైంది. సిర్పూర్(యూ), లింగాపూర్, రెబ్బెన, ఆసిఫాబాద్, కెరమెరి, వాంకిడి, కాగజ్‌నగర్ మండలాల్లో కురువాల్సిన దానికంటే అధిక వర్షం కురిసింది. మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కేవలం దహెగాం మండలంలో మాత్రమే తక్కువ వర్షపాతం నమోదైంది. జలాశయాలు పూర్తిగా నిండటం, భూగర్భజలాలు పెరుగుతుండడంతో వానాకాలం, యాసంగి సాగుకు ఎలాంటి ఢోకా లేదని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.
నిండిన జలాశయాలు
జిల్లావ్యాప్తంగా గడిచిన పదిహేను రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా భారీగా వరద వస్తుంది. ప్రధాన ప్రాజెక్టులతోపాటు చెరువులు నిండుకుండలా మారాయి. జూలై వరకు భారీ వర్షాలు లేక వెలవెలబోయిన నీటి వనరులు ప్రస్తుతం కళకళలాడుతున్నాయి. సాగు నీటితోపాటు తాగునీటికి కీలకమైన కుమురంభీం(అడ), వట్టివాగు, చెలిమెల, బొక్కివాగు, పీపీరావు ప్రాజెక్టులు దాదాపు పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉన్నాయి. కుమురంభీం ప్రాజెక్టులో పూర్తిస్థాయి 10.393 టీఎంసీలు కాగా, ఆనకట్ట సక్రమంగా లేకపోవడంతో 5.688 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచుతున్నారు. జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టులో నూ నీటిని నిల్వ చేసే అవకాశం లేదు. భారీగా వరద వస్తుండటంతో గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. అలాగే జిల్లాలో 563 చెరువులు కూడా పూర్తిగా నిండి అలుగు పోస్తున్నాయి. పెద్దవాగు, ఎర్రవాగుతోపాటు ఇతర వాగులు, ప్రాణహిత, పెన్‌గంగ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
వరినాట్లు పూర్తి..
సీజన్ ప్రారంభంలో వర్షాలు లేక వరిసాగుకు రైతులు సందిగ్ధంలో పడ్డారు. బోర్లు, బావులు ఉన్నవారు మాత్రమే ఆగస్టు మొదటి వారంలోగానే నాట్లు పూర్తిచేశారు. జూలై చివరివారం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడటంతో గతవారం వరకు వరినాట్లు పూర్తయ్యాయి. సుమారు 50 వేల ఎకరాల్లో వరి సాగు అవుతున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. వర్షాలతో పత్తికి తెగుళ్లు సోకకుండా రైతులు క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తున్నారు. పూత, కాత దశలో పంట ఆశాజనకంగా ఉందని అన్నదాతలు చెబుతున్నారు. అయితే 15 రోజుల క్రితం భారీ వరదలతో పెద్దవాగు, ఎర్రవాగు ఉప్పొంగి పంటలు నీట మునిగాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడిప్పుడే మొక్కలు వరద నుంచి కోలుకుంటున్నాయి.
పీపీరావు ప్రాజెక్టు
మత్తడి దూకుతున్న వరద
జూన్ నుంచి సెప్టెంబర్ 1 వరకు వర్షపాతం(మి.మీ.లలో)
మండలం కురువాల్సింది కురిసింది
జైనూర్ 906.3 1012.8
సిర్పూర్(యూ) 892.9 868.6
లింగాపూర్ 855.7 1028.3
తిర్యాణి 747.6 939.3
రెబ్బెన 743.9 1218.7
ఆసిఫాబాద్ 764.5 1036.6
కెరమెరి 766.4 1079.6
వాంకిడి 820.4 1070.7
కాగజ్‌నగర్ 784.5 1121.2
సిర్పూర్(టి) 898.6 915.6
కౌటాల 939.2 1023.1
చింతలమానెపల్లి 937.6 1030.9
బెజ్జూర్ 993.9 1104.3
పెంచికల్‌పేట్ 915.0 915.0
దహెగాం 930.6 880.5
ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటి నిల్వ
ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం ప్రస్తుత నీటినిల్వ ఇన్‌ఫ్లో ఔట్‌ఫ్లో
కుమురంభీం 10.393 5.688 6,600 5,900
వట్టివాగు 2.890 2.442 1,300 1,113
ఎన్టీఆర్ సాగర్ 0.37 0.376 150 160
పీపీరావు 0.848 0.848 750 750
జగన్నాథ్‌పూర్ 0.135 0.010 8,830 8,830