
పెన్షన్ భిక్ష కాదు.. ఉద్యోగి హక్కు
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం లభించే పెన్షన్ భిక్ష కాదని, అది వారి హక్కు అని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ జిల్లా అధ్యక్షుడు లింగాల రాజశేఖర్ అన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును విస్మరించి కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అమలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఉద్యోగులతో చర్చించకుండా సీపీఎస్‌కు మొగ్గుచూపిందని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారుగా 1,40,000 మంది సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు సామాజిక భద్రతపై ఆందోళన చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో ఇప్పటికీ పాతన పెన్షన్ విధానమే అమలులో ఉందని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి డీఎంహెచ్‌వో సీతారాం మద్దతు ప్రకటించారు. నిరసనలో జేఏసీ నాయకులు శాంతికుమారి, పెండ్యాల సదాశివ్, హేమంత్ షిండే, ఊశన్న, ఉమర్ హుస్సేన్, శ్రీనివాస్‌రావు, తుకారాం, ఖమర్ హుస్సేన్, భాగ్యలక్ష్మి, కలెక్టరేట్ ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులు పాల్గొన్నారు.