
టోకెన్లు సరే.. యూరియా ఏది?
కాగజ్‌నగర్‌టౌన్: జిల్లాలో యూరియా కోసం అన్నదాతలకు నిరీక్షణ తప్పడం లేదు. నిత్యం ఏదో ప్రాంతంలో పీఏసీఎస్ కార్యాలయాల ఎదుట క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. తాజాగా కాగజ్‌నగర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం వివిధ గ్రామాల రైతులు యూరియా కోసం ఆందోళనకు దిగారు. వ్యవసాయ శాఖ అధికారులు టోకెన్లు ఇస్తున్నా యూరియా బస్తాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. వ్యవసాయాధికారులు, ఫర్టిలైజర్ డీలర్లతో కుమ్మకై ్క కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కొందరు డీలర్లు బ్లాక్ మార్కెట్‌లో బ్యాగుకు రూ.700 నుంచి రూ.800 వరకు అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత అధికారులు నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ చర్యలు తీసుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు.
టోకెన్లకే పరిమితం
ఆగస్టు 12, 16వ తేదీల్లో పలు గ్రామాలకు చెందిన రైతులకు వ్యవసాయశాఖ అధికారులు టోకెన్లు ఇచ్చారు. ఇప్పటివరకు వారికి యూరియా బస్తాలు మాత్రం పంపిణీ చేయలేదు. పీఏసీఎస్‌లో వారం రోజులుగా స్టాక్ లేదని, కార్యాలయానికి రావద్దని చెబుతున్నారు. అయితే ప్రైవేటు డీలర్ల వద్ద మాత్రం నిల్వలు ఉండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు, నాయకులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని, పక్కదారి పడుతున్న ఎరువులపై నిఘా పెంచాలని అన్నదాతలు కోరుతున్నారు.

టోకెన్లు సరే.. యూరియా ఏది?