
బాధితులకు సత్వర న్యాయం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలోని పోలీస్ స్టేషన్లకు వివిధ కారణాలతో వచ్చే బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత పోలీసులకు ఫోన్‌లో సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా పోలీసుశాఖ సేవలు వినియోగించుకోవాలని సూచించారు.
పదోన్నతితో మరింత బాధ్యత
పదోన్నతుల ద్వారా ఉద్యోగులపై మరింత బాధ్యత పెరుగుతుందని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. కాగజ్‌నగర్ డీఎస్పీగా పనిచేస్తున్న బి.రామానుజం ఇటీవల అదనపు ఎస్పీగా పదోన్నతి పొందగా, సోమవారం జిల్లా కేంద్రంలో ఎస్పీ బ్యాడ్జీ తొడిగి శుభాకాంక్షలు తెలిపారు.
30 పోలీస్ యాక్ట్ కొనసాగింపు
జిల్లాలో శాంతిభద్రతలు, ప్రశాంతతను పెంపొందించేందుకు జిల్లావ్యాప్తంగా ఈ నెల 1 నుంచి 30 వరకు 30 పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. సబ్ డివిజనల్ పోలీసు అధికారి, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పబ్లిక్ సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించొద్దన్నారు. లౌడ్ స్పీకర్లు, డీజేలపై నిషేధం ఉంటుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.