
డెంగీ కలవరం!
ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతితో ఆందోళన జిల్లావ్యాప్తంగా ప్రబలుతున్న విష జ్వరాలు గ్రామాల్లో జాడలేని ఫాగింగ్
కౌటాల(ఆసిఫాబాద్): జిల్లాలో కురుస్తున్న విస్తారమైన వర్షాలకు పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారి దోమలు వృద్ధి చెంది సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. పల్లె జనం మంచం పడుతున్నారు. జ్వరం, కీళ్లు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులు జ్వరాల బారినపడి ఇంటిబాట పడుతున్నారు. ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న తిర్యాణి మండలం పంగిడిమాదర పంచాయతీ పరిధిలోని రాజాగూడ గ్రామానికి చెందిన ఆత్రం సీతారాం– దివ్యజ దంపతుల కుమారుడు ఆత్రం అనురాగ్(12) డెంగీతో సోమవారం రాత్రి మృతి చెందడం కలకలం సృష్టించింది. ఈ నెల 19న అతడికి డెంగీ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందిస్తుండగానే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
ఈ సీజన్‌లో 11 కేసులు
జిల్లాలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రి, ఐదు సీహెచ్‌సీలు, రెండు యూపీహెచ్‌సీలతోపాటు 15 పీహెచ్‌సీల్లో వైద్యసేవలు అందిస్తున్నారు. లింగాపూర్, బాబాపూర్ పీహెచ్‌సీల్లో ఆయుష్ వైద్యులు కూడా ఉన్నారు. పీహెచ్‌సీకి కనీసం ఇద్దరు, ముగ్గురు వైద్యులు ఉండాల్సి ఉండగా ఒక్కరే విధులు నిర్వర్తిస్తుండడంతో మెరుగైన వైద్యం అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలు ఉండగా, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న గ్రామ పంచాయతీలు 60కిపైగా ఉన్నాయి. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో 11 డెంగీ కేసులు నమోదయ్యాయి. దీంతో డెంగీ జ్వరం పేరు అంటేనే ఆందోళన మొదలైంది. ఆర్బో వైరస్‌తో ఈ జ్వరం సోకుతుంది. పగటిపూట కుట్టే ఎడిస్ ఈజిప్టి (టైగర్ దోమ) దోమతో వ్యాప్తి చెందుతుంది. పరిసరాల్లో నీరు నిల్వ ఉండటం, పారిశుద్ధ్యం లోపించడంతో దోమలు వృద్ధి చెందుతాయి. అనుమానం ఉంటే రోగికి వెంటనే రక్త పరీక్షలు చేయించాలి. తెల్ల రక్త కణాలు తగ్గడం, ప్లేట్‌లెట్స్ తగ్గడం, ఎర్ర రక్తకణాల పరిమాణం పెరగడం తదితర వివరాలు ఎలిసా పరీక్షతో నిర్ధారించవచ్చు.
పెరుగుతున్న వైరల్ జ్వరాలు
కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ డివిజన్ల పరిధిలో రెండు నెలల్లో 600 మందికి పైగా వైరల్ జ్వరాల బారిన ప డ్డారు. అలాగే 30 మలేరియా కేసులు, 50కి పైగా డ యేరియా, 30కి పైగా టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. అనాధికారికంగా జ్వర బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. సాధారణ ఫ్లూ జ్వరాలతో పాటు డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి వాటితో బాధపడుతున్నారు. మండల కేంద్రాల్లోని పీహెచ్‌సీల్లో సాధారణ రోజుల్లో 70– 80 వరకు ఓపీ ఉంటే ఆగస్టులో 160 వరకు పెరిగింది. జిల్లా ఆస్పత్రిలో రోజుకు 500 ఓపీ ఉండగా ప్రస్తుతం 700లకు పైగా వస్తున్నారు. నిత్యం సుమారు 80 వరకు ఇన్‌పేషెంట్లుగా ఉంటున్నారు. మరోవైపు జిల్లాలో సరై న సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. డెంగీకి ప్రధాన ఆస్పత్రుల్లోనే చికిత్స అందిస్తుండటంతో మారుమూల గ్రామాల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామాల్లో ఆర్‌ఎంపీలే జ్వరం నిర్ధారించి చికిత్స అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
దోమల విజృంభణ
గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ గాడితప్పింది. వై ద్యారోగ్య శాఖ, పంచాయతీ, మున్సిపల్ శాఖల స మన్వయంతో చేపట్టాల్సి పనులు ఆగిపోయాయి. డ్రెయినేజీల్లో పూడిక తీయడం లేదు. మురుగునీరు నిలిచి ఉంటుంది. దోమలు వృద్ధి చెందాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి జ్వరాల నియంత్రణ కు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.