
ప్రణాళికతో ప్రగతి..!
● గిరిజన బడుల బలోపేతానికి ప్రత్యేక కార్యక్రమాలు ● నెలనెలా అభ్యసన ఫలితాలపై సమీక్ష ● ప్రతీ విద్యార్థికి హెల్త్ ప్రొఫైల్ తయారీ ● జిల్లాలో 377 గిరిజన పాఠశాలలు
కెరమెరి(ఆసిఫాబాద్): గిరిజన ప్రాథమిక, ఉన్నత పాఠశాలల బలోపేతానికి ఐటీడీఏ అధికారులు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థుల్లో కనీస విద్యా సామర్థ్యాల పెంపే లక్ష్యంగా చర్యలు చేపట్టారు. ప్రతినెలా అభ్యసన ఫలితాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలు పెంచేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ పాఠశాలల్లో పక్కాగా అమలు చేస్తున్నారు. గిరిజన విద్యార్థులే పాఠశాలల నిర్వహణలో పాలుపంచుకునేలా ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలోని 15 క్లస్టర్ల పరిధిలో గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలు 46 ఉండగా, ప్రాథమిక పాఠశాలలు 331 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 14,190 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లాలోని గిరిజన పాఠశాలల్లో అమలు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలపై కథనం.
అక్షర జ్యోతి..
అక్షర జ్యోతి కార్యక్రమం గతేడాది నుంచి ప్రారంభమైంది. ప్రాథమిక పాఠశాలల్లో మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. తెలుగు, ఆంగ్లంలో చదవడం, రాయడం.. గణితంలో చతుర్విద ప్రక్రియల్లో కనీస నైపుణ్యాల కోసం 45 రోజులు కార్యాచరణ రూపొందించారు. 2వ తరగతి నుంచి 9వ తరగతుల వరకు బేస్‌లైన్ టెస్టులు నిర్వహించనున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు పర్యవేక్షణ, మార్పిడి విధులు అమలు చేయాలి.
విద్యార్థులతో కమిటీలు
ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను నాలుగు హౌజ్‌లుగా విభజించి వారిలో ఒకరి ని కెప్టెన్‌గా నియమించారు. సర్దార్ వల్లాభాయ్ పటేల్, జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ అనే పేరుతో కమిటీలు ఏర్పా టు చేశారు. ఈ గ్రూపుల్లోని విద్యార్థులు ఆశ్రమ పాఠశాలకు అధ్యక్షుడు, కార్యదర్శులుగా ప్రధానో పాధ్యాయుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు లేని స మయంలో పాఠశాలలను నిర్వహించడం, తోటి వి ద్యార్థులకు అనుమానాలను నివృత్తి చేయడం వంటి కార్యక్రమాలు చేపడతారు. ఒక్కో కమిటీకి ఒక్కో ఉపాధ్యాయుడిని ఇన్‌చార్జిగా నియమించారు.
నెలాఖరున మీటింగ్‌లు
ప్రతినెలా చివరిరోజు పాఠశాలల్లో ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశాల్లో విద్యార్థుల ప్రగతితోపాటు విద్యాభివృద్ధిపై సమీక్షించుకోవాలి. నెలవారీ సిలబస్ పూర్తి, అభ్యసన ఫలితాల పురోగతి, విద్యార్థుల హాజరు, ఆరోగ్యం, ఎఫ్‌ఏ, ఎస్‌ఏ పరీక్షల ఫలితాలపై సమీక్షించుకోవాలి. సదరు అంశాల్లో ఏవైనా సరైన పద్ధతిలో కొనసాగకుంటే ప్రధానోపాధ్యాయుడు ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేయాలి. ప్రతీ విద్యార్థికి హెల్త్ ప్రొఫైల్ ఉండేలా ప్రతినెలా ఆరోగ్యశిబిరాలు నిర్వహించాలి. నెలలో మూడో శనివారం పీటీఎం(పేరెంట్స్ టీచర్స్ మీటింగ్) నిర్వహించాలి. అదే శనివారం నో బ్యాగ్ డే అమలు చేయాలి. ఫుడ్ సేఫ్టీ కమిటీ, మెనూ కమిటీని ఏర్పాటు చేసి పకడ్బందీగా అయలు చేయాలి. అన్ని కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు పాల్గొనాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రాథమిక పాఠశాలల్లో ‘మిషన్ ఎడ్యుకేషన్’
జిల్లాలోని అన్ని గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో మిషన్ ఎడ్యుకేషన్ కార్యక్రమం అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం. ప్రార్థన సమయానికి హాజరు కావడం, ప్రతీ పాఠశాలకు నేమ్ బోర్డులు ఉండాలి. టీఎల్‌ఎంను గోడలపై ప్రదర్శించాలి. అలాగే విద్యార్థులు తయారుచేసిన టీఎల్‌ఎంలను కూడా ప్రదర్శించాలి. ప్రతిరోజూ హోంవర్క్ రాయించేలా చేయాలి. ఉపాధ్యాయులు నోటుపుస్తకాలు పరిశీలించాలి. వందశాతం హాజరుకు హెచ్‌ఎంలు చర్యలు తీసుకోవాలి.
లీప్ ఫర్ వర్డ్
ఎల్‌డబ్ల్యూఎఫ్ (లీప్ ఫర్ వర్డ్) అనే ఇంగ్లిష్ లర్నింగ్ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజూ కొన్ని పదాలను విద్యార్థులకు నేర్పిస్తున్నారు. వారిలో ఆంగ్ల నైపుణ్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో 3 నుంచి 5వ తగరతుల వరకు అమలు చేస్తున్నారు. యోక్(యంగ్ లీడర్ క్లబ్) కార్యక్రమాన్ని 6 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు అమలు చేస్తున్నారు. ప్రతీ తరగతి నుంచి ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసుకుని, వారిని టీం లీడర్‌లుగా ఎన్నుకుంటారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం. క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, కొలబరేషన్, కమ్యూనికేషన్ అనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.