
పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్
● నేటి నుంచి 11వ తేదీ వరకు ప్రక్రియ ● జిల్లాలో 108 మందికి ప్రమోషన్లు
ఆసిఫాబాద్‌రూరల్: ఎట్టకేలకు ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గురువారం రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ గురువారం సాయంత్రం షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో జిల్లా విద్యాశాఖలో ప్రమోషన్ల సందడి మొదలైంది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు గ్రేడ్– 2 హెడ్‌మాస్టర్లుగా, స్కూల్ గ్రేడ్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు. జిల్లాలో సుమారు 108 మందికి పదోన్నతి దక్కనుంది. శనివారం నుంచి ప్రారంభమయ్యే ప్రక్రియ ఈ నెల 11న ముగియనుంది. జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రమోషన్లకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు.
108 మంది అవకాశం..
జిల్లాలో 721 ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో స్కూల్ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు 2,447 మంది పనిచేయాల్సి ఉంది. ప్రస్తుతం 2,050 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మరో 397 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఎస్‌జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌ఏల నుంచి హెచ్‌ఎంలుగా ప్రమోషన్లు పొందనున్నారు. 108 మంది ఉపాధ్యాయులకు పదోన్నతుల అవకాశం రానుంది. ఇందులో ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఎస్‌జీటీలకు 76 మందికి ప్రమోషన్లు వస్తే ప్రైమరీ స్కూళ్లలో మరిన్ని ఖాళీలు ఏర్పడనున్నాయి. విద్యార్థులు నష్టపోకుండా విద్యావలంటీర్లను నియమించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఖాళీలు ఇలా..
జిల్లాలో ఉన్న 108 ఖాళీలలో పీజీ హెచ్‌ఎంలు 6, పీఎస్ హెచ్‌ఎంలు 26, స్కూల్ అసిస్టెంట్‌లు 76 మందికి అవకాశం రానుంది. సబ్జెక్టుల వారీగా ఖాళీలు పరిశీలిస్తే.. ఎస్‌ఏ గణితం 11, ఫిజికల్ సైన్స్ 7, బయోసైన్స్ 4, సాంఘిక శాస్త్రం 17, తెలుగు 13, హిందీ 12, ఇంగ్లిష్ 6, స్పెషల్ ఎడ్యుకేషన్ 6, తదితర పోస్టులు ఉన్నాయి.
షెడ్యూల్ ఇలా..
ఈ నెల 2న ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్– 2 హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలకు సంబంధించిన వివరాలను డీఈవో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. పదోన్నతుల కోసం ఎస్‌ఏ, ఎస్టీటీల తాత్కాలిక సీనియార్టీ జాబితా ప్రదర్శిస్తారు.
3న అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. 4, 5 తేదీల్లో సీనియార్టీపై అభ్యంతరాలను పరిష్కరించి, ఆర్జేడీ, డీఈవో వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు.
ఈ నెల 6న గ్రేడ్– 2 హెచ్‌ఎంల పదోన్నతి కోసం ఎస్‌ఏలకు వెబ్ ఆప్షన్ ఇచ్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు.
7న ఎస్‌ఏలకు గ్రేడ్– 2 పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు.
8,9వ తేదీల్లో పదోన్నతుల ఆర్డర్ వచ్చిన గ్రేడ్– 2 హెచ్‌ఎం పేర్ల ప్రదర్శన, ఎస్జీటీ ల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల పరిష్కారం, తుది జాబితా ప్రకటిస్తారు.
10వ తేదీన ఎస్జీటీ వెబ్, ఎడిట్ ఆప్షన్ ఇస్తారు.
11న కలెక్టర్ ఆదేశాల అనంతరం పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు ఉత్తర్వు కాపీలు అందజేస్తారు.
విద్యార్థులు నష్టపోకుండా చూడాలి
ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులకు అవకాశం ఇవ్వడం హర్షణీయం. ప్రమోషన్ల ద్వారా ఏర్పడిన ఖాళీల్లో వీవీలను నియమించాలి. విద్యార్థులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలి. సర్దుబాటు ప్రక్రియ కాకుండా నూతన నియామకాలు సైతం చేపట్టాలి.
– శాంతికుమారి,
యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు

పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్