
చిట్టిచేతులకు విముక్తి
● విజయవంతంగా ముగిసిన ‘ఆపరేషన్ ముస్కాన్– 11’ ● రెండు డివిజన్లలో కొనసాగిన తనిఖీలు ● 48 మంది బాలల గుర్తింపు, మూడు కేసులు నమోదు ● చిన్నారులు తిరిగి విద్యనభ్యసించేలా చర్యలు
వాంకిడి(ఆసిఫాబాద్): తప్పిపోయిన పిల్లలను గుర్తించి, వారి కుటుంబాలకు అప్పగించడం, బాల కార్మికులను రక్షించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోంది. జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివి జన్లలో జూలై 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన 11వ విడత కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. రెండు ప్రత్యేక బృందాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి 1– 18 సంవత్సరాల వయస్సు గల అనేక మంది బాలలకు విముక్తి కల్పించారు. తప్పిపోయిన, బాల కార్మికులుగా కొనసాగుతున్న పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించడమే కాకుండా కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆధునిక కాలంలో చదువు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. జిల్లాలో నెల రోజులపాటు నిర్వహించిన తనిఖీల్లో 48 మంది బాలలను రక్షించినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక బృందాలతో తనిఖీలు
ఆపరేషన్ ముస్కాన్– 11లో భాగంగా ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్లలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఒక సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్, ఒక మహిళా కానిస్టేబుల్, బాలల సంరక్షణ శాఖ నుంచి ఒకరు, చైల్డ్ హెల్ప్‌లైన్ నుంచి ఒకరు, కార్మిక శాఖ నుంచి ఒకరు చొప్పున ఉన్నారు. ఈ బృందాలు నెల రోజులపాటు జిల్లాలోని పరిశ్రమలు, హోటళ్లు, మెకానిక్ షాప్‌లు, రైల్వే స్టేషన్‌లు, బస్టాండ్‌లు, దాబాలు, ఇటుక బట్టీలు, మిల్లులలో తనిఖీలు చేపట్టాయి. గుర్తించిన బాలలు తిరిగి చదువుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.
48 మంది గుర్తింపు..
నెల రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో విద్యకు దూరంగా ఉంటున్న మొత్తం 48 మంది బాలలను గుర్తించారు. ఆసిఫాబాద్ డివిజన్‌లో 25 మందిని గుర్తించగా.. అందులో 23 మంది బాల కార్మికులు ఉన్నారు. మరో ఇద్దరు డ్రాప్ అవుట్ స్టూడెంట్లు ఉ న్నారు. కాగజ్‌నగర్ డివిజన్‌లో 23 మందిని గుర్తించగా.. అందులో 18 మంది బాలకార్మికులుగా ఉన్నారు. మరో ఐదుగురు డ్రాప్ అవుట్ పిల్లలు ఉన్నారు. పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి తిరిగి బడులకు పంపేలా చర్యలు తీసుకున్నారు. అనాథ పిల్లలను వసతి గృహాలకు తరలించి ఉచితంగా వసతి, భోజనం, విద్య, వైద్యం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. చదువుకునే వయస్సులో చట్ట వ్యతిరేకంగా బాలలను పనుల్లో పెట్టుకుని కార్మికులుగా మారుస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. తనిఖీల్లో భాగంగా మూడు కేసులు నమోదు చేశారు.
ఇటుకల బట్టీలో తనిఖీ చేస్తున్న సభ్యులు
బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు
18 ఏళ్లలోపు బాలలను పనుల్లో పెట్టుకుంటే చట్టరీత్య చర్యలు తీసుకుంటాం. చదువుకునే వయస్సులో పిల్లలను పనులకు పంపించకూడదు. జిల్లాలో రెండు ప్రత్యేక బృందాల ద్వారా నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా 48 మంది పిల్లలను రక్షించాం. మూడు కేసులు సైతం నమోదు చేశాం. బాలల సంరక్షణకు రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించారు. వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. బాల కార్మికులు, తప్పిపోయిన పిల్లలను గుర్తిస్తే సమాచారం అందించాలి. – బి.మహేశ్, జిల్లా బాలల సంరక్షణ అధికారి

చిట్టిచేతులకు విముక్తి