
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా!
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ మండలం బోరి గాం శివారులోని సర్వే నం.139లో రూ.25.44 కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు రెండేళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయి. పట్టించుకునే వారు లేకపోవడంతో పాక్షికంగా శిథిలావస్థ చేరుతున్నాయి. సామగ్రి సైతం దొంగలపాలైంది. గత ప్రభుత్వ హయాంలో కాగజ్‌నగర్ పట్టణంలో 2018 ఆగస్టు 2న అప్పటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నిర్మాణ పనులు ప్రారంభించారు. 20 బ్లాకుల్లో 480 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా, 288 మాత్రమే పూర్తి చేశారు. తాజాగా ఇళ్లను లబ్ధి దారులకు అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టులో మరమ్మతులు పూర్తిచేసి పంపిణీ పూర్తి చేయాలని భావిస్తున్నారు. నిర్మాణ పనులు పూర్తయి మూడేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో డబుల్ బెడ్రూంల చుట్టూ పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు పెరిగాయి. ఆ ప్రాంతం అడవిని తలపిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్లలోకి చొరబడి అందినకాడికి వస్తువులు ఎత్తుకెళ్లారు. కిటికీల అద్దాలు పూర్తిగా ధ్వంసం చేయడంతోపాటు విద్యుత్ స్విచ్‌లు పైపులు, వాటర్‌ట్యాంక్‌లు ధ్వంసం చేశారు. ఇళ్ల పైభాగంలో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్‌లు కొన్ని అపహరణకు గురికాగా, మిగితావి కిందపడి దెబ్బతిన్నాయి. అధికారులు స్పందించి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.