
ఆంగ్ల భాష నైపుణ్యాలు పెంచాలి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థుల్లో ఆంగ్ల భాష నైపుణ్యాలు పెంచాలని ఏసీఎంవో ఉద్దవ్ అన్నారు. మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ బోధించే ఉపాధ్యాయులకు జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీచర్లకు పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు. పాఠశాలలో జరిగిన కృత్యాలను వాట్సాప్ గ్రూపులో రోజువారీగా పంపాలని సూచించారు. గిరిజన విద్యార్థుల్లో ఇంగ్లిష్ సామర్థ్యాలు పెంచేందుకు అంకిత భావంతో పనిచేయాలన్నారు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల ఉపాధ్యాయులకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణ విద్యార్థులకు ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో మంచిర్యాల ఏసీఎంవో లక్ష్మణ్, డీఎస్‌వో మీనారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.